– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాచలం, ఏప్రిల్ 23 : కరకట్ట పనులు జూన్ నాటికి పూర్తి కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుత్తేదారులను ఆదేశించారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెంలో పర్యటించిన అనంతరం నేరుగా భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్ట పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యకపోయినా వారి అభివృద్ధి బాధ్యతను మేము తప్పకుండా నెరవేరుస్తామన్నారు.
బ్రిడ్జిని శ్రీరామనవమికల్లా ప్రారంభిస్తామని చెప్పి, శ్రీరామ నవమి రోజునే బ్రిడ్జిపై రాకపోకలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ జూన్ నాటికల్లా కరకట్ట నిర్మాణ పనులను పూర్తి చేసి, భద్రాచలం పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీ వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మహబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ పాల్గొన్నారు.