మధిర, సెప్టెంబర్ 15 : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి అని, ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో అనేక ప్రజా, కార్మిక పోరాటాలు జరిగాయని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు, సిపిఐ మధిర మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సోమవారం మండల పరిధి మడుపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఊట్ల సాంబయ్య, యల్లమది వెంకయ్య స్మారక స్థూపాల వద్ద జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. జమీందారీ, దోపిడీ, అన్యాయాలపై పేద రైతులు, కూలీలు ఏకమై పోరాడిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటమన్నారు. ఇలాంటి మహత్తర పోరాటాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ హైజాక్ చేసే ప్రయత్నాలు చేస్తోందని, ఈ పోరాటంలో బీజీపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ వంటి సంస్థల పాత్ర శూన్యమని అన్నారు.
ప్రజా, కార్మిక హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం నేడు జరుగుతున్న పోరాటాలకు తెలంగాణ సాయుధ పోరాటం మార్గదర్శకమని, నాటి సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్ తరాలకు చైతన్యం కలిగించటం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల బాధ్యతన్నారు. ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన సాయుధ పోరాటాన్ని విలీన దినోత్సవంగా ఎందుకు జరపలేకపోతున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెరుమాళ్లపల్లి ప్రకాష్ రావు, పంగ శేషగిరిరావు, జల్లా బ్రహ్మం, తలారి రమేష్, అన్నవరపు సత్యనారాయణ, రంగు నాగ కృష్ణ, నరసింహారావు, ఊట్ల రామకృష్ణ, పున్నవెళ్లి అప్పారావు, యల్లమద్ధి రాములు, కొండూరి నాగేశ్వరరావు, గోపి మడుపల్లి, సిపిఐ గ్రామ శాఖ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.