ఎర్రుపాలెం, సెప్టెంబర్ 17 : విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించి, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పని చేస్తుందని వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలాచారి అన్నారు. ఖమ్మం సర్కిల్ మధిర సబ్ డివిజన్ పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఎర్రుపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలా చారి మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుల సమస్యలపై నిర్వహించిన పరిష్కార వేదికలో వివిధ గ్రామాలకు చెందిన వినియోగదారులు తమ సమస్యలపై అర్జీలు అందించారని, మొత్తం 12 ఫిర్యాదులు అందించినట్లు తెలిపారు.
అత్యధిక మంది వినియోగదారులు అధిక విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు చేశారన్నారు. విద్యుత్ సిబ్బందికి బిల్లులు చెల్లించేందుకు డైరెక్ట్ గా డబ్బులు ఎవరూ ఇవ్వవద్దని, ఆన్లైన్ ద్వారా బిల్లులు చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ టెక్నికల్ మెంబర్ కె.రమేష్, ఫైనాన్స్ మెంబర్ ఎన్.దేవేందర్, ఇండిపెండెంట్ మెంబర్ ఎమ్.రామారావు, డి సాంబశివరావు, డీఈ బి.శ్రీనివాసరావు, ఏడిఏ అనురాధ, ఏఈలు అనూష, శ్రీనివాసరావు, లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.