కూసుమంచి (నేలకొండపల్లి), నవంబర్ 3: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని, అభివృద్ధిలో అద్భుతంగా దూసుకెళ్తోందని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఉన్నన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. పాలేరు నియోజవకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నదే తన ధ్యేయమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు వారి పిల్లలను మంచిగా చదివించుకోవాలని సూచించారు. అందుకోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేలకొండపల్లి మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన..
కొత్తకొత్తూరు, తిరుమలాపురం, అజయ్‌తండా, రాజారాంపేట, ముఠాపురం, కట్టకొమ్ముగూడెం తండా, శంకరగిరి తండా, రాజేశ్వరపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన కేసీఆర్.. సీఎం అయ్యాక అద్భుతమైన పథకాలతో రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని వివరించారు. గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ముందున్నదని అన్నారు. ఇంతమంచి పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. తాను కూడావ్యక్తిగతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తనవంతుగా తోడ్పాటునందించానని వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు కందాళకు బొట్టు పెట్టి హారతిపట్టారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నం బ్రహ్మయ్య, వజ్జా రమ్య, నంబూరి శాంత తదితరులు పాల్గొన్నారు.