గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకూ ఎడాపెడా హామీలు గుప్పించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలు సంగతి మరిచింది. ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఇంకో అడుగు ముందుకేసి దాదాపు అన్ని వర్గాలకూ ఎగనామం పెడుతూ వస్తోంది. ఇదే క్రమంలో వీవోఏల (గ్రామ సంఘం సహాయకులు)కూ రిక్తహస్తం చూపింది. దీంతో ఇన్నాళ్లూ ఎంతో సహనంగా పోరాడిన వీవోలు.. ఇటీవల తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధర్నాలు, రిలే దీక్షలు, ఆందోళనలు, నిరవధిక సమ్మెలు వంటి నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఆయా మండలాల్లో ఇటీవల చేపట్టిన నిరసనలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అన్ని నిరసన వేదికల నుంచి వీవోఏలు నినాదాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి హామీలు అమలుచేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలకు పరిష్కారం చూపేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్ని స్పష్టం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఉన్న 952 మంది వీవోలు ఆకలితో అలమటిస్తూ.. నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. 46 డిగ్రీలుగా నమోదవుతున్న మండుటెండలను సైతం లెక్కచేయకుండా తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాటలో ఉన్నారు.
-అశ్వారావుపేట, మే 24

మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం కోసం పనిచేస్తున్న వీవోఏలు తమ సమస్య పరిష్కారం కోసం పోరుబాట పట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం కనీస మాత్రంగానూ స్పందించడంలేదు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆందోళనను ఉదృతం చేసిన అసోషియేషన్ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కొనసాగిస్తామని సంఘం నాయకులు స్పష్టం చేస్తున్నారు. నిన్నామొన్నటి దాకా వినతిపత్రాల సమర్పణలు, సమ్మె నోటీసులు ఇస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కొన్ని రోజుల క్రితం ఏకంగా నిరవధిక సమ్మెకు దిగారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో సుమారు 1,300లకు పైగా ఉన్న స్వయం సహాయక సంఘాల సెర్ప్ ఉద్యోగులతో సమానంగా 952 మంది వీవోఏలూ పనిచేస్తున్నారు.
ఏళ్ల తరబడి నామమాత్రపు వేతనంలో మహిళా స్వయం సహాయక సంఘాలను బతోపేతం చేస్తున్న వీవోఏలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటునారు. సెర్ప్ ఉద్యోగులతో సమానంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీవోఏలకు కుటుంబపోషణ భారంగా మారింది. కేవలం రూ.5 వేలు మాత్రమే గౌరవ వేతనం చెల్లిస్తుండడంతో వీవోఏల కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని, రూ.20 వేల వేతనం ఇస్తామని, ఇంకా అనేక సమస్యలను పరిష్కారిస్తామని హమీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వీరి సమస్యలను పట్టించుకోవడం లేదు. దీంతో తొలుత వినతిపత్రాలు, సమ్మె నోటీసులతో తమ గోడును ప్రభుత్వానికి విన్నవించారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 6 నుంచి చేపట్టిన కార్యాచరణకు అనుగుణంగా ఇటీవల నిరవధిక సమ్మెకు దిగారు.
భద్రాద్రి జిల్లాలో 952 మంది వీవోఏలు..
జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో సుమారు 1,300లకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 952 మంది వీవోఏలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల (ఎస్‌హెచ్‌జీ) బలోపేతం, పేదరిక నిర్మూలనలో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం వీవోఏలకు రూ.5 వేలు మాత్రమే నామమాత్రపు గౌరవ వేతనం చెల్లిస్తోంది. దీంతోపాటు గ్రామ మహిళా సంఘాలు లాభాల్లో ఉంటే మరో రూ.3 వేలు తీసుకునే వెసులుబాటు ఉంది. గ్రామ సంఘాల పరిపాలన, రికార్డుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీల్లో ఎస్హెచ్సీలకు వీరు తోడ్పాటునందిస్తారు.
అలాగే, పొదుపు సంఘాల్లో మహిళలను సంఘటితం చేయడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం వంటివి వీరి ప్రధాన బాధ్యతలు. గ్రామ, మహిళా సంఘాల ఆర్థికపరమైన అంశాలు, పొదుపు, రుణ వివరాలను రికార్డుల్లో నమోదు చేయడం, ప్రభుత్వ పధకాల పట్ల సంఘాల సభ్యులకు అవగాహన కల్పించడం, పథకాలను సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షించడం వంటివి చేస్తారు. బ్యాంకుల నుంచి సంఘాలకు రుణాలు మంజూరు చేయించడమే కాకుండా వాటిని తిరిగి చెల్లించేలా విధులు నిర్వర్తిస్తుంటారు. ఇలా.. ఇంతగా కష్టపడుతున్న వీవోఏల సంక్షేమాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోంది. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని వీవోఏలు డిమాండ్ చేస్తున్నారు.
కుటుంబ పోషణ భారంగా మారింది..
రూ.5 వేల నామమాత్రపు గౌరవ వేతనంతో ఏళ్ల తరబడి పని చేస్తున్నాం. అయితే, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. చేస్తున్న పనికి సమానంగా వీవోఏలకు కనీస వేతనం అందడం లేదు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం కోసం పనిచేస్తున్న వీవోఏలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-దాసరి రేవతి, వీవోఏ, అశ్వారావుపేట
ఎన్నికల హామీలను అమలు చేయాల్సిందే..
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాల్సిందే. అంతవరకు ఆందోళనను కొనసాగిస్తాం. ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా, సమ్మె నోటీసులు అందించినా ప్రభుత్వం కనీస మాత్రంగానూ స్పందించలేదు. అందుకే నిరవధిక సమ్మెకకు దిగాం. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తాం.
-ఇరప పవన్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వీవోఏల అసోషియేషన్