మధిర, మార్చి 31 : ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ మృత్యుంజయ సమీపంలో ఆక్రమణకు గురైన స్మశాన వాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హిందూ స్మశాన వాటికకు సంబంధించిన పది ఎకరాల్లో కొంత స్థలాన్ని పలువురు వ్యక్తులు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. స్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైందని పలుసార్లు మున్సిపల్, రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే ఆధారంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు సంబంధిత నివేదికను తయారుచేసి జిల్లా ఉన్నతాధికారులకు పంపించారు.
అధికారి ఇచ్చినా నివేదికలో కొంతమంది పేదలు ఇళ్ల నిర్మాణం చేసుకుని నివాసముంటున్నారని నివేదికలో పొందుపరిచారు. ఈ విషయాన్ని సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తాసీల్దార్ రాంబాబు సంబంధిత నివేదికను అందజేశారు. ఆక్రమణకు గురైన భూమి వివరాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ స్మశాన వాటిక స్థలంలో బీపీఎల్ కుటుంబాలను మినహాయించి మిగిలిన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.