బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు నీరుగార్చుతోంది. ఇంటింటికీ గోదావరి జలాలను నాడు కేసీఆర్ తాగునీరుగా అందించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ మోటర్లు, పైపులైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేయించలేకపోతున్నది. దీంతో గ్రామాల్లో చేతిపంపులే దిక్కయ్యాయి. గొత్తికోయ గ్రామాల్లో సోలార్ సిస్టంలు పని చేయకపోవడంతో వారు కూడా చేతిపంపుల మీదనే ఆధారపడుతున్నారు.
ప్రభుత్వ అధికారులు మాత్రం లెక్కల్లో అన్ని ఇండ్లకు నల్లాలు వేశాం.. భగీరథ నీరు ఇంటింటికీ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆచరణలో చూస్తే మాత్రం అది కనిపించకపోవడం బాధాకరం. పై అధికారులు కింది అధికారులపై ఆధారపడి కాకిలెక్కలు చూపెడుతుంటే.. ఆపై స్థాయి అధికారులు పరిశీలనకు వచ్చేసరికి అసలు డొల్లతనం బయటపడుతున్నది. దీంతో తప్పులు సరిదిద్దుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఏదేమైనా పల్లె ప్రజలు వేసవి ప్రారంభంలోనే తాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిపిస్తున్నది.
– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 24 (నమస్తే తెలంగాణ)

Khammam
“లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మకాలనీలో వలస ఆదివాసీలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలో భగీరథ నీరు ఇవ్వడం కుదరనందున గత బీఆర్ఎస్ ప్రభుత్వం సోలార్ సిస్టం ద్వారా తాగునీరు సరఫరా చేసింది. కానీ, నాలుగు నెలల క్రితం సోలార్ మోటరు చెడిపోవడంతో ఆ గ్రామస్తులకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఊరిలో ఒక చేతిపంపు ఉండటంతో అదే వారికి దిక్కయింది. అక్కడ ఉన్న 30 కుటుంబాలకు చేతిపంపే ఆధారమైంది. చిన్నగా వచ్చే ఆ నీటినే క్యూలో నిలబడి తెచ్చుకుంటున్నారు.
సోలార్ మోటరును వెంటనే మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యను తీర్చాలని ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు.”“లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పరిధిలోని పాతూరు గ్రామంలో 76 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ భగీరథ పైప్‌లైన్ వేసినా నీరు మాత్రం రావడం లేదు. ట్యాంకుకు వేరే బోరు నుంచి మోటరు లైన్ వేసినా త్రీఫేజ్ కరెంటు వస్తేనే తప్ప అక్కడ తాగునీరు రాదు. ఉన్నది ఒకటే చేతిపంపు అందరూ అదే పంపు మీద ఆధారపడాల్సిందే. ఇంకా ఎండలు ముదిరితే ఈ పంపులో కూడా నీరు తగ్గే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.”
ఏ పథకం వచ్చినా అది మారుమూల గ్రామాలకు చేరితేనే పథకం సక్సెస్ అయినట్లు అధికారులు చెప్పుకోవాలి. కానీ, పల్లెలకు అందని పథకాలు సక్సెస్ అని ఎలా చెప్పుకుంటున్నారో తెలియడం లేదు. చర్ల, దుమ్ముగూడెం మండలంలో ఇప్పటికీ 14 గ్రామాలకు భగీరథ నీరు రావడం లేదంటే నమ్మరేమో. ఇది అధికారికంగా చెప్పిన లెక్కలే. ఇదేకాదు.. ములకలపల్లి మండలం ఉచ్చలబండి గ్రామానికి తాగునీరు లేదు. మంజూరైనా పైపులైన్లు వేయడం లేదు. గొత్తికోయ గ్రామాలకు సోలార్ ద్వారా మోటర్లు పెట్టినా అందరూ ఒకచోటకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిందే. టేకులపల్లి మండలం చింతోనిచిలక గ్రామ పరిధిలో సర్వాయిబోడు గ్రామంలో భగీరథ నీరు రాదు. చాలాసార్లు అధికారుల వద్దకు తిరిగితే ఇటీవలే బోరు వేశారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల పరిధిలో మారుమూల గ్రామాలకు తాగునీరు కష్టంగానే ఉంటుంది. వేసవి వస్తే అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే గోదావరి ఉన్నా ఉపయోగం లేకుండా పోతున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మోటరు చెడిపోయి నాలుగు నెలలు..
సోలార్ మోటరు పనిచేయడం లేదు. నాలుగు నెలల నుంచి ఇవే తిప్పలు. చేతిపంపు వద్దకు వస్తే చాలా టైం పడుతున్నది. పనికిపోయే వాళ్లం.. ఇబ్బంది అవుతున్నది. మాకు నీళ్లు ఉంటే చాలు ఏమీలేకున్నా పర్వాలేదు. ఇంకో బోరు వేయాలి.
– మడకం ఉంగ, గంగమ్మ కాలనీ, లక్ష్మీదేవిపల్లి మండలం
ఎండాకాలం నీళ్లు లేకపోతే కష్టమే..
ఎండాకాలం నీరు లేకపోతే ఎట్లా బతకాలి. అడవి పనికిపోతే టిన్నులో నీరు తీసుకుపోతున్నం. చేతిపంపు దగ్గరే టైం అంతా అయిపోతున్నది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు.. అందరూ వస్తున్నరు.. పోతున్నరు తప్ప తాగునీరు ఇచ్చేవారు లేరు.
– సోడి జోగి, గంగమ్మ కాలనీ, లక్ష్మీదేవిపల్లి మండలం
76 కుటుంబాలకు ఒకటే పంపు
మా ఊరిలో 76 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఒకటే చేతిపంపు ఉంది. అందరం అక్కడే పట్టుకోవాలి. వచ్చేనెలలో ఈ పంపులో కూడా నీరు రాదు. చాలా ఇబ్బంది అవుతుంది. పెద్ద ట్యాంకు ఉన్నా అక్కడ నీరు మాకు రాదు. పైప్లైన్లు వేశారు.. కానీ, చుక్కనీరు కూడా రావడం లేదు.
– చింత వీరమ్మ, పాతూరు, లక్ష్మీదేవిపల్లి మండలం
పైప్లైన్లు వేశారు.. నీరు లేదు
భగీరథ పైప్లైన్లు వేశారు.. కానీ, చుక్కనీరు కూడా రావడం లేదు. ఒక్క చేతిపంపు మీదనే అందరం ఆధారపడాల్సి వస్తున్నది. ఎంతకాలం మాకు ఈ తాగునీటి సమస్య. పెద్దపెద్ద సార్లు వచ్చి మీటింగ్‌లు పెడతారు.. రేపటి నుంచి నీళ్లు వచ్చేస్తాయి అంటారు.. అన్నీ ఉత్తమాటలే చెబుతున్నారు. పంపు కొట్టాలంటే చేతులుపోతున్నాయి. అసలే ఎండాకాలం పంపుల వద్ద గంటలకొద్దీ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.
– తాటి రమణ, పాతూరు, లక్ష్మీదేవిపల్లి మండలం
మా గోడు పట్టించుకునేవాళ్లే లేరు..
చర్ల మండలంలోని బోధనెల్లి, ఎర్రబోరు, కుర్నపల్లి, కొరటపాడు తదితర ఆదివాసీ గ్రామాల్లో పైపులైన్ల లీకులు, ట్యాంకుల స్వల్ప మరమ్మతులున్నాయి. వేసవికాలం ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్న పాపానపోలేదు. ఎర్రబోరులో ట్యాంక్‌లోకి ఎకించిన నీరు లీకవుతున్నది. ఊరు చివర నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. మా గోడును పట్టించుకునే దికు లేకుండాపోయింది.
– సున్నం వీరయ్య, ఎర్రబోరు, చర్ల మండలం
ఎర్రబోరులో చేతిపంపు వేయాలి..
కుర్నపల్లి నుంచి ఎర్రబోరు, కొర్కటపాడు, పులిగుండాల, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని డోకుపాడు, నిమ్మలగూడెం, కరిగుండం గ్రామాలకు ఆదివాసీలం నిత్యం రాకపోకలు సాగిస్తున్నాం. మా అందరి కోసం ఎర్రబోరు సమీపంలోని కూడలిలో చేతిపంపు ఏర్పాటు చేయాలి. బోరు వేస్తే కుర్నపల్లి నుంచి కొరటపాడు వెళ్లేవారికి మరోవైపు ఆర్.కొత్తగూడెం వైపు వెళ్లేవారికి ఉపయోగంగా ఉంటుంది.
– పాయల గణేశ్, ఎర్రబోరు, చర్ల మండలం
భద్రాద్రి జిల్లాలో భగీరథ లెక్కలు
ఇంటింటికీ ఇచ్చిన నల్లాలు : 2,21,374
ఇంకా నల్లాలు ఇవ్వాల్సినవి : 6,791
మొత్తం చేతిపంపులు : 6,967
మరమ్మతులు ఉన్నవి : 138
సింగిల్ ఫేజ్ మోటర్లు : 1004
రిపేర్లు ఉన్నవి : 33