రామవరం, జూలై 31 : మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమాం, మౌజన్ల గౌరవ వేతనానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీపెట్టే యత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ఇమాం, మౌజన్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి పథకానికి తూట్లు పొడుస్తున్నది. ఇందులో భాగంగా ఆంక్షలతో కూడిన నిబంధనలు రూపొందించింది.
ఈ నిబంధనల ప్రకారం.. ఇమాం, మౌజన్లు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌పుస్తకం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాన్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, మజీదు ధ్రువీకరణ పత్రం అందజేయాలని అది కూడా జూలై 31వ తేదీ గడువు తేదీగా ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమాం, మౌజన్లు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
సర్క్యులర్ విడుదల చేస్తే మైనార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని భావించిన ప్రభుత్వం మెజార్టీ ప్రజలు చదవని పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఒకవేళ మారుమూల పల్లెల్లో ఉన్నవారు విషయం తెలుసుకోకపోతే వారి గౌరవ వేతనం కోత పడే అవకాశం ఉంది. ఇప్పకైనా ప్రభుత్వం దొంగచాటు పనులు కాకుండా గతంలో ఏవిధంగా గౌరవ వేతనాన్ని అందించారో అదేవిధంగా అందించాలని కోరుతున్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ఏమైంది?
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇప్పుడు ఇమాం, మౌజన్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతోపాటు క్రిస్టియన్ పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ, అధికారంలోకి వచ్చి ఉన్న పథకానికే తూట్లు పొడిచే పనులను చేస్తున్నారని ముస్లిం మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో లేని ఆంక్షలు ఇప్పుడెందుకు..?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా కేవలం ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, మజీదు కమిటీ లెటర్‌హెడ్ ద్వారా ధ్రువీకరించిన ధ్రువపత్రంతో గౌరవ వేతనాన్ని ఇమాం, మౌజన్ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఒకవేళ ఎవరైనా ఇమాం, మౌజన్ మారినా లేదా చనిపోయినా వారిని తీసి కొత్త వారిని పెట్టుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే మళ్లీ వారికి ఆ స్థానంలో గౌరవ వేతనం అందేది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగించి పాత పద్ధతిలో గౌరవ వేతనాన్ని అందించాలని కోరుతున్నారు.
ఆంక్షలను తొలగించాలి..
గతంలో ఏ విధంగా అయితే ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనాన్ని అందించారో అదేవిధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా అందించాలి. లేకుంటే చాలా మంది గౌరవ వేతనాన్ని కోల్పోతారు. వక్ఫ్ బోర్డు అధికారులే ఒక దరఖాస్తు ఫారం రూపొందించాలి.
– మొహ్మద్ యాకూబ్ పాషా, జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం
పాత పద్ధతినే కొనసాగించాలి..
ఇమాం, మౌజన్లకు చాలా మందికి రేషన్‌కార్డు లేకపోవడంతో ప్రస్తుతం ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకోలేకపోతున్నారు. గతంలో మాదిరి మసీదు కమిటీ లెటర్‌హెడ్ స్వీకరించి వేతనాన్ని అందించాలి. ఇప్పుడెందుకు కొత్త నిబంధనలు పెడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాన్‌కార్డు ఎలా తేవాలి.
– మొహ్మద్ అబ్దుల్ ఉమర్, మజీదే కౌసర్ ప్రెసిడెంట్, గౌతంపూర్
సర్క్యులర్ రాలేదు..
వక్ఫ్ బోర్డు వా రు ప్రెస్మీట్లో చెప్పారు.. కానీ, సర్క్యులర్ ఏమీ రాలేదు. గడువు పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ వ చ్చాయి. దానిని పాటించాల్సి ఉంది. పర్సనల్ ఆఫీసు వారి కి సర్క్యులర్ ఇస్తారు.సర్క్యులర్ త్వరలో వస్తుంది.
– మొహ్మద్ ఫైజుద్దీన్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్