గ్రామీణ ప్రాంతాల్లో పాడి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు 2000వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియ మించింది. వీరు గ్రామాల్లో పశువైద్యులకు సహాయకులుగా పని చేస్తున్నారు. ముఖ్యంగా మేలు జాతి దూడలను పెంపొందించడంతోపాటు, యదకు వచ్చే పశువులకు ప్రభుత్వం అందించే సెమన్ అందిస్తారు. అంతేకాకుండా పశువులు, జీవాలు, కోళ్లకు వ్యాక్సిలింగ్ చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. పశు సంపద అభివృద్ధిలో ప్రభుత్వ సిబ్బందికి పోటీగా పనిచే
స్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం నాలుగు నెలలుగా వేతనాలు మంజూరు చేయకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారి
తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
– సత్తుపల్లి, ఆగస్టు 3
ఖమ్మం జిల్లాలో 190 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70మంది వరకు గోపాలమిత్రలు పని చేస్తున్నారు. వీరు పశువుల సంరక్షణ, సంతతి పెంపు విషయంలో కీలకంగా పని చేస్తున్నారు. కృత్రిమ గర్భధారణలో మేలు జాతి పశువులు సంతతి పెంచడం, పశుగ్రాసం పెంచడం, దూడల పోషణ, పశువులు, జీవాల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, నట్టల నివారణ మందులు పంపిణీ, వ్యాక్సినేషన్ వంటి పనుల్లో పశువైద్య సిబ్బందికి సహాయం చేస్తున్నారు. వీరి సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 30శాతం వేతనం పెంచుతూ జీవోను కూడా జారీ చేసింది. వీరికి గత ప్రభుత్వాల్లో మొదట్లో రూ.1250 నుంచి రూ.3 వేల వరకు జీతాలు ఇచ్చేవారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.8500 చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక రూ.11,050 పెంచి ప్రతినెలా సక్రమంగా వేతనాలు అందించేవారు.
నాలుగు నెలలుగా అందని వేతనం
గోపాలమిత్రలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 10నెలలుగా వేతనాలు ఆపి ఇటీవల కాలంలో 6నెలల వేతనాలు విడుదల చేసింది. మిగిలిన 4 నెలల వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంపై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలతోపాటు, తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా కనీసం స్పందన లేదని మనోవేదనకు గురవుతున్నారు.
లక్ష్యం చేరకుంటే వేతనం కట్.
గోపాలమిత్రలు ప్రతినెలా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలి. లేకుంటే వేతనంలో కోత తప్పదు. నెలలో ఒక్కో గోపాలమిత్ర సుమారు 100 పశువులకు కృతిమ గర్భధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు పాడిరైతుల నుంచి గోపాలమిత్రలు రూ.40 చొప్పున వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి. ఏదైనా ఒక నెలలో టార్గెట్ పూర్తికాకపోతే తమ వేతనంలో కోత పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలు ఇవే..
25ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి.. పశుగణాభివృద్ధి శాఖ నుంచి పశుసంవర్థకశాఖలోకి విలీనం చేయాలి.. సీనియారిటీని గుర్తించి పశు సంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న సబార్డినేట్ పోస్టులు భర్తీ చేయాలి.. ప్రమాదబీమా కుటుంబ సభ్యులందరికీ వర్తింపచేయాలి.. వేతనాలు పెంచి ప్రతినెలా సక్రమంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలి
ఎన్నో ఏళ్లుగా గోపాలమిత్రలుగా పనిచేస్తున్నాం. గ్రామాల్లో పశువుల సంతతి పెంచేందుకు కృషి చేస్తున్నాం. రైతులు సమస్య చెప్పగానే వారి వద్దకు వెళ్తున్నాం. ప్రయాణ సమయంలో ప్రమాదాల బారిన పడినా ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనం రూ.24 వేలు చెల్లించి ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లించాలి.
– బొడ్డు వెంకటేశ్వర్లు, గోపాలమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఖమ్మం