పత్తి పంట కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధనను తెస్తూ రైతులను పరేషాన్ చేస్తోంది. పత్తి సాగు చేసిన రైతులు అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గుతోందని దిగాలు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి సేకరణ కూడా ప్రారంభం కావడంతో భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. దీపావళి మరుసటి రోజే పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తామని మార్కెటింగ్ శాఖ ప్రకటించినా భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓపిక నశించిన కొందరు రైతులు తమ పంటను దళారులకు విక్రయించుకొని ఆర్థికంగా నష్టపోతున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సుమారు 2.21 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి పంట సాగవుతోంది. దీనికి 26 లక్షల క్వింటాళ్ల దిగుబడులు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. మిగతా పంటను ఎక్కడ విక్రయించుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు.
అశ్వారావుపేట, నవంబర్ 8 : సీసీఐ నిబంధనలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ వారికి మద్దతు ధర అందడం లేదు. నిరుటి వరకు రైతులు తమకు ఇష్టం వచ్చిన జిన్నింగ్ మిల్లులు, సీసీఐ కేంద్రాల్లో తమ పంటను విక్రయించుకునే వారు. ఇందుకోసం వ్యవసాయాధికారులు టెంపరరీ రిజిస్ట్రేషన్లు(టీఆర్) జారీ చేసేవారు. అధికారులు కూడా రైతు చెప్పిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చేలా చేశారు. అయితే, ఈ విధానంలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఉన్నతాధికారులు నిర్ధారించారు. అక్రమాల నివారణ పేరుతో ఈ ఏడాది నుంచి ‘కపాస్ కిసాన్’ అనే యాప్‌ను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం రైతులు యాప్‌లో ముందుగా వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేస్తారు. యాప్‌లో స్లాట్ బుకింగ్ లేకుంటే పత్తి విక్రయానికి వీలుండదు. ఈ విధానంపై 80 శాతం మంది రైతులకు అవగాహన లేదు. అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ ఇబ్బందులు భరించలేని రైతులు తమ పంటను దళారులకు విక్రయించుకొని నష్టపోతున్నారు.

రైతుల్లో అయోమయం..
సీసీఐ నిబంధనలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సుమారు 26 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ, అకాల వర్షాలు, వరదలు, మొంథా తుపాను వంటివి పత్తి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. తక్కువలో తక్కువ ఎకరానికి 8 క్వింటాళ్లయినా పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు తొలుత అంచనా వేశారు. మరోసారి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి అంచనాలను సవరించారు. ఎకరానికి 11.74 క్వింటాళ్ల దిగుబడి వస్తుందంటూ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు.
ఆ నివేదికను కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఈ నివేదిక ఆధారంగా ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు పత్తిని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చింది. కానీ, సీసీఐ మాత్రం ఎకరానికి 7 క్వింటాళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎకరానికి ఏకంగా 5 క్వింటాళ్లు కోత విధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ బుకింగ్లోనూ ఎకరానికి 7 క్వింటాళ్లకే సాఫ్ట్వేర్ అనుమతినిస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు తమను సగానికిపైగా దెబ్బతీయగా.. ఇప్పుడు ఆ మిగతా సగాన్ని సీసీఐ దెబ్బతీస్తోందంటూ పత్తి రైతులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
తేమ పేరుతో తరుగు..
ఇటీవలి వర్షాలకు పత్తిలో కూడా తేమ శాతం అధికంగా ఉంటోంది. అయినప్పటికీ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. 812 మధ్య తేమ శాతం ఉంటేనే సీసీఐ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. రూ.8,110 మద్దతు ధర ఇస్తున్నారు. అంతకంటే కొంచెం ఎక్కువ ఉన్నా ఒక్కో క్వింటాకు కిలోన్నర చొప్పున కటింగ్ పెడుతున్నారు. దీంతో రైతులు మద్దతు ధరను, తరుగును కోల్పోతున్నారు. ఇక సీసీఐ కేంద్రాలు కూడా జిల్లాలో తగినన్ని లేవు. జిన్నింగ్ మిల్లులున్న బూర్గంపహాడ్, కారేపల్లి, సుజాతనగర్, అశ్వాపురంలలో మాత్రమే సీసీఐ కేంద్రాలున్నాయి. బూర్గంపహాడ్‌లో మరో రెండు జిన్నింగ్ మిల్లులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఆంక్షలు తొలగించాలి..
పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తివేయాలి. పండిన పంటనంతా ప్రభుత్వమే కొనాలి. వర్షాల వల్ల నష్టపోతున్న రైతులనూ ఆదుకోవాలి. తేమ శాతం నిబంధనలను, ఆంక్షలను తొలగించాలి. లేకపోతే పత్తి రైతులం నష్టపోతాం.
-పూసం వెంకటేశ్వర్లు, పత్తి రైతు, చండ్రుగొండ
సీసీఐ కేంద్ర ం ఏర్పాటు చేయాలి..
అశ్వారావుపేట ఏజెన్సీ ప్రాంతంలో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. సీసీఐ కేంద్రం లేక దూరప్రాంతాలకు పత్తిని తీసుకెళ్లలేక స్థానిక వ్యాపారులకే తక్కువ ధరకు విక్రయించుకుంటున్నాం. ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధర చెల్లించడం లేదు.
-చిత్తలూరి వెంకన్న, పత్తి రైతు, అన్నపురెడ్డిపల్లి
పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు సీసీఐ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. పత్తి రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు వారి ఫోన్లలో ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఎకరానికి 7 క్వింటాళ్ల చొప్పునే కొంటున్నాం.
-జాలా నరేందర్, డీఎంవో, కొత్తగూడెం