గత ఏడాది నిర్వహించిన పశువుల సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. దీంతో పశువుల వివరాలు అందుబాటులో లేక జిల్లా అధికారులు మందులు, వ్యాక్సినేషన్ వంటి అవసరాలకు అంచనా లేక ఇబ్బంది పడుతున్నారు. సర్వే పూర్తి చేసి ఏడాది గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పశువుల లెక్కలను ప్రకటించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ‘పశు ధన్’ యాప్‌లోనే నిక్షిప్తమైన వివరాలు బయటకు రాకపోవటంతో ఏ జాతి పశువులు ఎన్ని ఉన్నాయో కొత్త సమాచారం లేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. 2018-19వ సంవత్సరంలోని పశువుల లెక్కలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. పాతలెక్క ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం పశు జాతులు 6,84,263 ఉన్నాయి. -అశ్వారావుపేట, డిసెంబర్ 16
దేశంలోని పశువుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకోసారి పశుగణన చేపడుతుంది. దీనిద్వారా పశువులకు అవసరమైన వ్యాక్సినేషన్, డీవార్మింగ్, మందులు సరఫరా అంచనా వేసుకుని రాష్ర్టాలకు పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగానే 2024 నవంబర్‌లో 21వ అఖిల భారత పశుగణన మొదలుపెట్టింది. ఈ సర్వే ఆరునెలలపాటు కొనసాగి 2025 ఏప్రిల్‌లో పూర్తయ్యింది. వైద్యాధికారులు, సిబ్బంది సర్వే ద్వారా గుర్తించిన పశువులను ‘పశు ధన్’ యాప్‌లో నమోదు చేశారు. సుమారు 16రకాల జంతు జాతుల వివరాలను సేకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 22 మండలాల్లో 471 గ్రామ పంచాయతీలతోపాటు పట్టణాల్లోని పశువులను గుర్తించి వివరాలు నమోదు చేశారు.
వివరాలు వెల్లడించని కేంద్రం..
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పశుగణన వివరాలను ఏడాది పూర్తైనా నేటికీ ప్రకటించలేదు. పశువైద్య సిబ్బంది నిర్వహించిన సర్వే వివరాలన్నీ సెంట్రల్ సర్వర్లోకి వెళ్లిపోయాయి. సర్వే పూర్తైన మూడునెలలకే కేంద్ర ప్రభుత్వం పశువుల లెక్కలు ప్రకటించాల్సి ఉన్నా ఆలస్యం చేస్తోంది. కొత్తగా చేపట్టిన సర్వే ప్రకారం జిల్లాలో ఎన్ని పశువులు ఉన్నాయన్న లెక్కలు అందుబాటులో లేక జిల్లా అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2018-19లో నిర్వహించిన పశువుల లెక్కలతోనే కాలం గడిపేస్తున్నారు. ఏ సమాచారం కోసమైనా ఈ లెక్కలనే ప్రాతిపదికన తీసుకుంటున్నారు. గతంలో 2018-19లో నిర్వహించిన పశుగణన సర్వే వివరాలను కూడా మూడేళ్ల తర్వాత 2022లో ప్రకటించింది. ఈసారి కూడా ఇదే జరుగుతుందనే భావన అధికారుల్లో వ్యక్తమవుతున్నది.
అంచనాలు తారుమారు..
కొత్త సర్వే పశువుల లెక్క అందుబాటులోకి రాకపోవడంతో పశువైద్యాధికారులు ఇబ్బంది పడుతున్నారు. డీవార్మింగ్, వ్యాక్సినేషన్, ఇతర మందుల అంచనా తారుమారు అవుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాతలెక్కల ప్రకారం ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులు, వ్యాక్సిన్ సరిపోకపోవచ్చని అనుమానిస్తున్నారు. ఒకవేళ పశువులు పెరిగితే పాతలెక్కల ప్రకారం పంపిణీ చేసిన మందులు, వ్యాక్సిన్ కచ్చితంగా సరిపోవని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొంత మేరకు ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.
కొత్త వివరాలు అందుబాటులో లేవు
గత ఏడాది జరిగిన పశుగణన వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. మొత్తం 16 రకాల పశు జాతుల వివరాలను సేకరించి ‘పశు ధన్’ యాప్‌లో నమోదు చేశాము. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ పశువులు ఎన్ని ఉన్నాయన్న కచ్చితమైన వివరాలు చెప్పలేము. పాతలెక్కల ప్రకారం ముందుకెళ్తున్నాము.
-మామిళ్ల వెంకటేశ్వర్లు, జిల్లా పశు వైద్యాధికారి, భద్రాద్రి కొత్తగూడెం
2018-19లో సర్వే ప్రకారం..
ఆవులు: 2,00,844
గేదెలు: 1,25,587
గొర్రెలు: 1,55,406
మేకలు: 2,00,462
జిల్లాలో మొత్తం పశువులు: 6,84,263