మామిళ్లగూడెం, మే 28 : జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు పరీక్షల నిర్వహణపై చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీఎస్పీఎస్సీ నియమ నిబంధనల ప్రకారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ చేపట్టాలన్నారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానం పాటిస్తున్నారని, జిల్లాలో మొత్తం 52 సెంటర్లు ఏర్పాటు చేయగా.. 18,403 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షల ముందురోజు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు.
జూన్ ఒకటో తేదీ నుంచి అభ్యర్థుల హాల్‌టికెట్లు సంబంధిత సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని, ప్రతి కేంద్రంలో ఉదయం 10 గంటలకు గేట్లు మూసి వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి హాలులో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తెచ్చుకోవాలని తెలిపారు. హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించుకొని, సొంత డిక్లరేషన్ రాసి ఇవ్వాలని, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్, సెల్ఫోన్లకు అనుమతి లేదని తెలిపారు. అదనపు డీసీపీ ప్రసాదరావు, డీఆర్వో రాజేశ్వరి, విజయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జాన్‌బాబు, ఎస్బీఐటీ ప్రిన్సిపాల్ రాజకుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.