రఘునాథపాలెం/ బోనకల్లు, డిసెంబర్ 23: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు ఆగడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోతున్న అధికార పార్టీ గూండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లపైకి వచ్చి దాష్టీకానికి పాల్పడుతున్నారు. అధికారంలో ఉన్నాం.. మమ్మల్ని ఏమీ చేయలేరనే అహంతో దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోలేదనే అక్కసుతో సోమవారం రఘునాథపాలెం మండలం జింకలతండా గ్రామంలో బీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో అభంశుభం తెలియని ఏడేళ్ల బాలుడి తలకు తీవ్రగాయమైంది. తాజాగా మంగళవారం ఇదే మండలం రాంక్యాతండా గ్రామంలో కాంగ్రెస్ ఓటమిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ సర్పంచ్ గెలుపునకు పాటుపడిన వ్యక్తి ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులందరినీ విచక్షణారహితంగా కొట్టారు. రాంక్యాతండాలో కాంగ్రెస్ వార్డు సభ్యురాలైన బానోతు పార్వతి, ఆమె బంధువు కేళోతు లచ్చిలు సర్పంచ్ అభ్యర్థి తేజావత్ వెంకన్న ప్రోద్బలంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు భూక్యా రాములు ఇంటిపై మూకుమ్మడిగా దాడికి దిగారు.
రాములుని బయటకు లాక్కొచ్చి విచక్షణారహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన రాములు కుమారుడు గణేశ్, కోడలు రాజేశ్వరి, భార్య సుశీలను సైతం తీవ్రంగా కొట్టారు. దాడికి పాల్పడిన పార్వతి, ధరావత్ విజయ్, బానోత్ రాజేశ్, కేళోత్ లచ్చి. బానోత్ జశ్వంత్, ధరావత్ గణేశ్‌లపై రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. రాములు ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, రఘునాథపాలెం మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండతోనే ఇలాంటి అహంకార చర్యలకు పాల్పడుతున్నారని, ఇది దుర్మర్గపు రాజకీయ చర్యగా మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
బోనకల్లు మండలం ఆళ్లపాడులో..
బోనకల్లు మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం కూటమి విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతికంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ తరఫున వార్డు సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన మల్లాది లింగయ్య ఎదురింట్లో ఉన్న పదిలం ఉదయ్‌కిరణ్, ప్రమీలపై దాడికి పాల్పడ్డాడు. ఉదయ్‌కిరణ్‌ను కర్రతో కొట్టి గాయపరిచి, ప్రమీలను అసభ్యంగా దూషించాడు.
అడ్డుకోవడానికి ప్రయత్నించిన చెన్నకేశవ శ్రీకాంత్‌పై లింగయ్య కొడుకు ఉపేందర్ దాడి చేశాడు. ఘర్షణను సెల్ఫోన్లో వీడియో తీస్తున్న చెన్నకేశవ వేణును సైతం దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చంపుతామని బెదిరిస్తూ ఆరాచకం సృష్టించినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధితులు బోనకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై పొదిలి వెంకన్నకు ఫిర్యాదు చేశారు. గాయపడిన వారిని చికిత్స కోసం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాధితులకు కమల్‌రాజు పరామర్శ..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే ఓటమిని అంగీకరించలేక కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. అరాచకాలను మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.