గతేడాది వచ్చిన వరదలను ఖమ్మం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన మున్నేరు వరద వందల కుటుంబాలను అతలాకుతలం చేసింది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడిపిన క్షణాలు కండ్ల ముందే కదలాడుతున్నాయి. మళ్లీ వర్షాకాలం వస్తుండడంతో మున్నేరు బాధితుల వెన్నులో వణుకు పుడుతున్నది. అయితే ‘మున్నేరు కరకట్ట’ పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని అనుకున్నారు.. కానీ.. పనులు నత్తనడకన సాగుతుండడంతో భయం గుప్పిట్లోనే బతుకుతున్నారు.
మున్నేరుకు రెండువైపులా కలిపి 17 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించాల్సి ఉండగా.. కేవలం 2 కిలోమీటర్ల పొడవున మాత్రమే.. అది కూడా ప్రభుత్వ భూమి ఉన్నచోటే పనులు ప్రారంభించారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా భూ సేకరణ ముందుకు సాగడం లేదు. నిర్వాసితులకు ప్యాకేజీ ఇచ్చేందుకు నిధులు మంజూరైనప్పటికీ రెవెన్యూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఫలితంగా 2026 మార్చి నాటికి పూర్తికావాల్సిన కరకట్ట ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు.
-ఖమ్మం, మే 24
మున్నేరు ముంపు ప్రాంతాల ప్రజలకు గతేడాది జరిగిన నష్టం, పడిన బాధలు అన్నీఇన్నీ కావు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి మున్నేరు ఒడ్డున నివసించే ప్రజల బాధలను పట్టించుకున్న నాధుడే లేడు. అలాంటిది గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దూరదృష్టితో ఆలోచించి మున్నేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. మున్నేరు కరకట్ట పనులకు అప్పటి మంత్రులు కేటీఆర్, అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. మున్నేరు కరకట్ట నిర్మాణానికి రూ.690.52 కోట్లను కేటాయిస్తూ జీవో జారీ చేశారు.
ఐతే ఎన్నికల కోడ్ రావడంతో టెండర్లు పూర్తికాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెండర్ ప్రక్రియను పూర్తిచేసి పనులు ప్రారంభించింది. గోళ్లపాడు యాక్విడెంట్ నుంచి ప్రకాశ్‌నగర్ చప్టా వరకు మున్నేరుకు ఇరువైపులా సుమారు 8.5 కిలోమీటర్ల పొడవున మొత్తం 17 కిలోమీటర్లు కరకట్ట నిర్మించాల్సి ఉంది.
కరకట్ట కింది భాగంలో 15 మీటర్ల వెడల్పు.. పైభాగం వచ్చేసరికి 9 నుంచి 12 మీటర్ల వెడల్పు ఉండేలా నిర్మించాలి. కానీ.. ఇప్పటివరకు రెండువైపులా కలిపి కేవలం 2 కిలోమీటర్ల పొడవున.. అదికూడా ప్రభుత్వ భూమి ఉన్నచోట మాత్రమే పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా భూ సేకరణ పనులు ముందుకు సాగడం లేదు. నిర్వాసితులకు ప్యాకేజీ ఇచ్చేందుకు నిధులున్నప్పటికీ రెవెన్యూ అధికారులు తీవ్ర ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
4 వేల ఇండ్లు, 10 వేల కుటుంబాలు
మున్నేరు నదికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గల రామన్నపేట కాలనీ, దానవాయిగూడెం కాలనీ, ఆటోనగర్, పద్మావతినగర్-3, పద్మావతినగర్-2, పద్మావతినగర్-1, వెంకటేశ్వనగర్, బొక్కలగడ్డ(మంచికంటి నగర్) హిందూ శ్మశానవాటిక, మోతీనగర్, రంగనాయకులగుట్ట, పంపింగ్‌వెల్ రోడ్, సుందరయ్యనగర్, ప్రకాశ్‌నగర్, ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి, రాజీవ్ స్వగృహ, కరుణగిరి, నాయుడుపేట, జలగంనగర్, ఆర్టీసీ కాలనీ, సాయిప్రభాత్ నగర్, కోటనారాయణపురం ప్రాంతాలు ఉన్నవి.
ఈ ప్రాంతాల్లో సుమారు 4 వేల ఇండ్లు, 10 వేల కుటుంబాలు నివసిస్తున్నవి. గత ఏడాది మున్నేరుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 42 అడుగుల వరద.. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో ఆ ప్రాంత జనాభా మొత్తం వారం రోజులపాటు పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మున్నేరుకు వరదలు రావడం కొత్తమీ కాదు.. 2005లో 34 అడుగులు వచ్చింది.. ఇదే రికార్డు. కానీ.. గతేడాది వచ్చిన వరద మున్నేరు చరిత్రలో ఇప్పటివరకు రాలేదు. 2023లో కూడా దాదాపు 32 అడుగుల వరద వచ్చింది.
నత్తనడకన భూసేకరణ
మున్నేరు కరకట్ట పనులు ప్రారంభం కావడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అనేక ఏండ్లుగా మున్నేరు ఒడ్డున నివసిస్తున్న తమ ఇళ్లను కూల్చుతారా.. అనే భయంతో బతుకుతున్నారు. మున్నేరు ముంపు ప్రాంతాల్లో నివాస స్థలాలు, ఇళ్లు, ప్లాట్లతోపాటు వ్యవసాయ భూములు ఉన్నాయి. ఐతే ప్లాట్లు, ఇళ్లు రిజిస్ట్రేషన్ ఉన్నవాటికి, పట్టాలు ఉన్న భూములకు నష్టపరిహారం ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే వాటికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
మున్నేరు భూ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఇండ్లు కోల్పోతున్న పేద ప్రజలందరికీ భూములు ఇవ్వాలి. ఇండ్లు నిర్మించి ఇవ్వాలి. గతంలో ఖమ్మంలో కొత్త కలెక్టరేట్ నిర్మించేటప్పుడు, ధంసలాపురం వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మాణ సమయంలో రైతులకు ఏ విధంగా నష్టపరిహారం ఇచ్చారో అదేవిధంగా ఇవ్వాలి. కరకట్ట నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేయాలి.
– తోట రామారావు, మాజీ కార్పొరేటర్, ఖమ్మం
భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది..
మున్నేరు కరకట్ట నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ చట్టం కింద ఇప్పటివరకు రైతుల నుంచి 70 ఎకరాలు తీసుకున్నాం.. ఇంకా 69 ఎకరాలు తీసుకోవాలి. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటున్నాం. నష్టపోతున్న వారికి ఖమ్మంకు దగ్గరలో పోలేపల్లి రెవెన్యూలో భూములు ఇవ్వనున్నాం. ఎకరం స్థలానికి 700 గజాలు, ప్లాట్ ఉంటే ఎన్ని గజాలు ఐతే అన్ని గజాలు ఇస్తున్నాం. ఇండ్లకు సంబంధించి వ్యాల్యువేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది.
– జి.నర్సింహారావు, ఖమ్మం ఆర్డీవో
పనులు శరవేగంగా జరుగుతున్నయ్..
ఖమ్మంలో మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్ట నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ భూమిలో 4 కిలోమీటర్ల పొడవున పనులు నడుస్తున్నాయి. ప్రైవేటు భూముల్లో కూడా వారంరోజుల్లో పనులు ప్రారంభిస్తాం. నిర్దేశించిన సమయంలోగా కరకట్టను పూర్తి చేస్తాం.
-మంగళపుడి వెంకటేశ్వర్లు, ఎస్ఈ, ఖమ్మం