ఖమ్మం అర్బన్, మార్చి 30: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్‌ను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. ఈ ఫలితాలపై తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో పక్షపాతం ప్రదర్శించారని రాష్ట్ర స్థాయిలో పలువురు అభ్యర్థులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే ప్రభుత్వం జీఆర్ఎల్ని విడుదల చేసింది. రీకౌంటింగ్‌కు సైతం ఖమ్మం జిల్లా నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఎలాంటి మార్పులు లేకుండానే టీజీపీఎస్సీ ఈ మార్కులను వెల్లడించింది. దీనిపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ విడుదలైన ఫలితాల్లో జిల్లాకు చెందిన కొందరు అభ్యర్థులు ఉత్తమ మార్కులు సాధించారు.
గ్రూప్-1 సాధన.. నాన్న కల..
ఏఎంవీఐగా నియమితులై రవాణా శాఖ ఖమ్మం కార్యాలయంలో శిక్షణ పొందుతున్న గోపీకృష్ణ గ్రూప్-1లో 493.5 మార్కులతో రాణించాడు. రాష్ట్రస్థాయిలో జీఆర్‌ఎల్‌లో 70వ ర్యాంకు, మల్టీజోన్-1లో 38వ ర్యాంకు సాధించాడు. ఇతడి స్వస్థలం హనుమకొండ జిల్లా. గ్రూప్-1 అధికారి కావాలనేది తన తండ్రి కల. ఇతడు గతంలో వరుసగా సెంట్రల్ వాటర్ కమిషన్‌లో జూనియర్ ఇంజినీర్, బోర్డర్ రోడ్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఆర్సీఎఫ్ఎల్, కొచ్చిన్ షిప్‌యార్డ్, ఐవోసీఎల్, ఇరిగేషన్ శాఖల్లో ఏఈఈ ఉద్యోగాలు సాధించాడు.
-గోపీకృష్ణ, జీఆర్ఎల్ 70వ ర్యాంకర్
తండ్రి ప్రోత్సాహంతో..
కామేపల్లి మండలం ముచ్చర్లలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు దాసరి రవికిరణ్. అతడి కుమారుడు మైఖేల్ ఇమ్మానుయేల్రాజ్. తండ్రి రవికిరణ్ పోత్సాహంతో గ్రూప్-1కు సిద్ధమయ్యాడు మైఖేల్. ఆదివారం విడులైన జీఆర్‌ఎల్‌లో 429.5 మార్కులతో మల్టీజోన్ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించాడు. మైఖేల్ ప్రస్తుతం డోర్నకల్‌లో తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా, వీరితోపాటు జిల్లాకు చెందిన మరికొందరు అభ్యర్థులు కూడా జీఆర్‌ఎల్‌లో ఉత్తమ మార్కులు సాధించారు.
-మైఖేల్, మల్టీ జోన్ కేటగిరీలో 5వ ర్యాంకర్