వైరా, మే 28: పంట వ్యర్థాలకు రైతులు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు రోడ్డు వెంట ఉన్న చెట్టుకు అంటుకొని అది కాలిపోయి టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, అతడి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ఘటన వైరా మండలం రెబ్బవరం గ్రామం వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వైరా నుంచి మధిర వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెబ్బవరం గ్రామ సమీపంలో రైతులు పంట పొలాల్లోని వ్యర్థాలకు పెట్టిన నిప్పు క్రమక్రమంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు అంటుకుంది. దీంతో శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారుపై ఒక్కసారిగా కాలిపోయిన చెట్టు విరిగిపడటంతో అదుపుతప్పి బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు, అతడి భార్య, తల్లిదండ్రులు, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు అద్దాలు ధ్వంసం కావడంతోపాటు పూర్తిగా దెబ్బతిన్నది.