– గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు
కారేపల్లి, ఆగస్టు 26 : మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) దాడులు చేయడం తక్షణమే ఆపాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీఎంసీ అనుచిత దాడులతో గ్రామీణ వైద్యులను భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో వైస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు పారా మెడికల్ బోర్డు ద్వారా శిక్షణ ఇచ్చి అర్హత సాధించిన ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడికి ధృవీకరణ సర్టిఫికెట్లు అందించే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 65 వేల మంది ధరఖాస్తులు చేసుకున్నారని, వారిలో 55 వేల మందిని అర్హులుగా తేల్చారన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంతో దానికి నిధుల కేటాయింపు లేక ఆ పక్రియ నిలిచిపోయిందన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పక్రియను కొనసాగిస్తుందని ఆశించామన్నారు.
కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో గ్రామీణ వైద్యుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీజీఎంసీ గ్రామీణ వైద్యులపై దాడి చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవటం విచారకరమన్నారు. గ్రామాలలో వైద్య సేవలు అందించటానికి క్వాలీఫైడ్ వైద్యులు ముందుకు రాకపోవడంతోనే పల్లె ప్రజలు గ్రామీణ వైద్యులపై ఆధార పడుతున్నారన్నారు. గ్రామీణ వైద్యులను గ్రామీణులే రక్షించుకుంటారన్నారు. గ్రామీణ వైద్యులు బతుకుదెరువు కోసం పోరాటాలు చేయాల్సి పరిస్ధితిని టీజీఎంసీ తీసుకు వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పంధించి గ్రామీణ వైద్యుల సేవలకు చట్టబద్దత తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతావరపు వెంకటాచారి, ఉపాధ్యక్షుడు నారపోగు సుదర్శన్, జిల్లా కౌన్సిల్ సభ్యులు దాసరి శ్రీనివాసరావు, మనోహర్, సింగరేణి మండల అధ్యక్ష, కార్యదర్శులు మండిపూడి వీరయ్య చౌదరి, కార్యదర్శి రఘు,ఐ.వెంకటేశ్వర్లు, ఎస్.రామారావు, బ్రహ్మం, సైదులు, దేవరాజ్ పాల్గొన్నారు.