ఖమ్మం రూరల్, నవంబర్ 7 : విద్యుత్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించే విధంగా చూడాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. మండల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా ఎన్పీడీసీఎల్, ఓఅండ్ఎం అధికారులు, సిబ్బందికి గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా విద్యుత్ వినియోగం అధికంగా పెరిగిందని, దీనికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. మరమ్మతుల కోసం నాణ్యమైన పరికరాలను వినియోగించాలన్నారు.
ప్రధానంగా విద్యుత్ వైర్లు, ఇతర పరికరాలు, విడి విభాగాలు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలన్నారు. రోజువారీ విద్యుత్ సరఫరా ఎలా ఉంది? పూర్తిగా ఆగిపోతుందా? అవాంతరాలు తలెత్తుతున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనేది ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. సదస్సులో డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్‌రావు, డైరెక్టర్ హెచ్ఆర్డీ బి.అశోక్, చీఫ్ ఇంజినీర్ కిషన్, సురేంద్ర, చిన్నబాబు, డీఈలు, ఏడీఈలు పాల్గొన్నారు.