ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 7 : నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల కారణంగా అర్హత లేని వారికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు పోరాడారు. ఫలితంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అనర్హుల ఉద్యోగాలు పోయాయి. అర్హులకు కొలువులు లభించాయి. కీలకమైన సర్టిఫికెట్ల పరిశీలన దశలోనే అనర్హులను తిరస్కరించాల్సి ఉంది. కానీ వారికి నియామకపత్రాలు అందజేశారు. సుమారు పదిహేను రోజులు ఉద్యోగం చేసేలా వ్యవహరించారు. తరువాత వ్యవహారం బయటకు వచ్చింది. డీఎస్సీ 2024లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), హిందీ లాంగ్వేజ్ పండిట్ (ఎల్పీ)లలో అర్హత లేదని పేర్కొంటూ ఏడుగురు అభ్యర్థులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఖమ్మం డీఈవో తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిస్థానంలో అర్హులైన వారికి, పెండింగ్ స్థానాల్లో ఉన్న వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. దీంతో వారు గురువారం విధుల్లో చేరారు.
డీఎస్సీ 2024లో భాగంగా హిందీ సబ్జెక్ట్‌లో జరిగిన తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నియామక పత్రం అందజేస్తున్న సమయంలోనే ఒకరిని తొలగించారు. అర్హత లేదంటూ తాజాగా మరో ఏడుగురిని టర్మినేట్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఒకరిని, హిందీ ఎల్పీలో ఆరుగురిని తొలగించారు. ఆయా పోస్టుల్లో ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన డిగ్రీ, పీజీలో క్వాలిఫికేషన్ లేదని పేర్కొంటూ డీఈవో సోమశేఖరశర్మ టర్మినేషన్ ఉత్తర్వులను అందజేశారు. అక్టోబర్ 2 నుంచి 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగగా.. అక్టోబర్ 15న నియామక పత్రాలు అందజేశారు. వాటితో అక్టోబర్ 16న ఆయా స్కూళ్లలో రిపోర్ట్ చేసిన ఎల్పీలను సుమారు 24 రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తొలగించిన వారిలో శ్రీదేవి, నాగేశ్వరరావు, రామలింగయ్య, వెంకటరత్నం, నాగలక్ష్మి, లావణ్య, నాగులుమీరా ఉన్నారు.
తొలగించిన వారి స్థానాల్లో అర్హులను నియమిస్తూ డీఈవో ఉత్తర్వులివ్వడం, వారు తక్షణమే విధుల్లో చేరడం వంటివి వెనువెంటనే జరిగిపోయాయి. ఎల్పీ హిందీలో ఏడుగురికి, స్కూల్ అసిస్టెంట్‌లో ముగ్గురికి నియామక పత్రాలు అందజేశారు. విధుల్లో చేరిన హిందీ ఎల్పీల్లో జేవీ శ్యామ్‌ప్రసాద్, బాజీ, షాహినాబేగం, పద్మ, నాగేశ్వరరావు, ఈశ్వరీబాయి, రామ్‌ప్రసాద్ ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లలో వాజీర్, శిరీష, అర్షద్పాషా ఉన్నారు. అయితే, తాజాగా తొలగించిన ఏడుగురి స్థానాల్లో మరో ఏడుగురిని నియమించగా.. గతంలో పెండింగ్ ఉన్న మూడు స్థానాలకు ముగ్గురిని నియమించారు. మొత్తం 520 మంది ఉపాధ్యాయులకు జిల్లాలో నియామకపత్రాలు ఇవ్వాల్సి ఉంది. వారిలో 517 మందికి అక్టోబర్ 15 నాటి కౌన్సెలింగ్‌లో నియామకపత్రాలు అందించారు. కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో ఒకరికి, అర్హత లేదని గుర్తించడంతో మరొకరికి, డిగ్రీ సర్టిఫికెట్‌కి అర్హమైనది కాకపోవడంతో ఇంకొకరికి.. నియామపత్రాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. తాజాగా రిప్లేస్ చేస్తున్న ఏడుగురితో కలిపి ఈ ముగ్గురికి కూడా నియామక పత్రాలు అందించారు. దీంతో ఈ పదిమంది గురువారమే ఆయా హెచ్ఎంలకు రిపోర్టు చేసి విధుల్లో జాయిన్ అయ్యారు.
అర్హతలేని టీచర్లను తొలగించి.. అర్హులైన వారికి నియామకపత్రాలు అందించిన ఈ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు గోప్యంగా నిర్వహించారు. నూతన టీచర్లు గురువారం ఉదయమే విధుల్లో చేరేలా ఆయా పాఠశాలల హెచ్ఎంలకు సూచించి వారిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారులు తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నించారు. తొలగించిన టీచర్లు కోర్టును ఆశ్రయించకుండా ఉండేందుకే ఈ ప్రక్రియను అత్యంత గోప్యంగా నిర్వహించారు.
డీఎస్సీ 2024 సర్టిఫికెట్ల పరిశీలన మొదలైనప్పటి నుంచి నియామకపత్రాలు అందించే వరకూ జరిగిన ప్రక్రియలో పలు తప్పిదాలు ఉన్నాయని, నిర్లక్ష్యం జరుగుతోందని ‘నమస్తే తెలంగాణ’ ముందే పేర్కొంది. వీటిపై వరుస కథనాలను కూడా ప్రచురించింది. ‘సర్టిఫికెట్ల పరిశీలన సక్రమమేనా?’ అనే శీర్షికన అక్టోబర్ 22న ప్రధాన కథనాన్ని ప్రచురించింది. సర్టిఫికెట్ల పరిశీలనలో చోటుచేసుకున్న లోపాలపై ఎత్తిచూపింది. ఈ క్రమంలో కలెక్టర్‌తోపాటు త్రీమెన్ కమిటీ విద్యాశాఖ అధికారులు స్పందించారు. హిందీకి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనను మరోసారి క్షుణ్ణంగా నిర్వహించారు.
ఉద్యోగంలోంచి తొలగించిన టీచర్లు.. డీఈవో కార్యాలయం ఎదుట గురువారం సాయంత్రం ఆందోళన చేశారు. తమ జీవితాలతో విద్యాశాఖ ఆటలాడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ర్టాల్లో చెల్లుబాటు అవుతున్న సర్టిఫికెట్లు ఇక్కడెందుకు చెల్లుబాటు కావంటూ ప్రశ్నించారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలోనే చెప్పాల్సిన ఈ విషయాలను ఉద్యోగంలో చేరాక చెప్పడం.. తమను మానసిక క్షోభకు గురిచేస్తోందని వాపోయారు. ‘సాక్షాత్తూ సీఎం చేతుల మీదుగా మాకు నియామకపత్రాలు ఇచ్చారు. ఇప్పుడు తొలగించామంటే కుదరదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి’ అంటూ నినాదాలు చేశారు.
డీఎస్సీ 2024లో కొందరికి అర్హత లేకపోయినా వారు ఉద్యోగాలు పొందేందుకు కారణమైన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ ఆర్జేడీకి డీఈవో వివరాలు సమర్పించారు. సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.