ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మేస్త్రీలు కామేశ్వరరావు, ఉపేందర్ మృతిచెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, వామపక్షాల నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేంత వరకూ మృతదేహాల పోస్టుమార్టానికి అంగీకరించబోమంటూ తేల్చిచెప్పాయి. మృతుల కుటుంబ సభ్యులు, నాయకులు ఆసుపత్రి మార్చురీ వద్ద భీష్మించారు. దీంతో వైద్యులు మార్చురీ గదికి వెళ్లలేకపోయారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, రెండు కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు అక్కడికి చేరుకొని.. మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని, ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి అప్పగించారు.
బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, ఆకోజు సునీల్‌కుమార్, రేపాక పూర్ణచందర్రావు, వామపక్ష నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేశ్, ఎంబీ నర్సారెడ్డి, గడ్డం స్వామి, కుల సంఘాల నాయకులు, మృతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను బీఆర్ఎస్, వామపక్ష నాయకులు పరామర్శించారు. న్యాయం జరిగేంత వరకూ మీతో కలిసి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు.. ఆర్డీవో దామోదర్‌రావుతో సమావేశమయ్యారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రమాద కారకులను శిక్షించాలని కోరారు.