– అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్, సిపిఎం శ్రేణుల ధర్నా
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 13 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మొత్తం 16 వార్డులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరిగింది. అయితే మూడో వార్డులో స్వతంత్ర అభ్యర్థి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి 17 ఓట్ల తేడాతో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూచన మేరకు రీకౌంటింగ్ చేశారు. అయినప్పటికీ 17 ఓట్ల తేడాయే రావడంతో స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే మొదటి వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో 5 ఓట్ల తేడాతో పరాజయం పొందాడని అధికారులు తెలిపారు. అదేవిధంగా 18వ వార్డులో సైతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 8 ఓట్ల స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలు కావడం జరిగింది.
స్వల్ప తేడాలతో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు మరోసారి బ్యాలెట్లను లెక్కించాలని అధికారులకు పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి తరఫున ఉన్న కౌంటింగ్ ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని బయటికి పంపించడంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, సీపీఎం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం వద్ద చేరుకుని దాదాపు గంట నుండి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు ఉపక్రమించారు. అక్కడికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ శ్రేణులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఏదులాపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత