ఎర్రుపాలెం, మార్చి 23: ఎర్రుపాలెం మండలంలో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని, నిందితుడి పక్షాన నిలుస్తున్నారనే మనోవేదనతో బాధిత బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫిర్యాదు తీసుకునేందుకు ఎస్ఐ నిరాకరించడంతో బాధిత బాలిక కుటుంబీకులు, గ్రామస్తులు పలు దఫాలుగా రాస్తారోకో చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. గ్రామస్తులు, బాధిత బాలిక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడకు చెందిన బాలిక (17)పై అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల యువకుడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది.
అయితే, ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఐదారు రోజుల క్రితం ఎర్రుపాలెం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఆమె ఫిర్యాదును తీసుకునేందుకు స్థానిక ఎస్సై వెంకటేశ్ నిరాకరించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు శనివారం ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లి పోలీసు కమిషనర్‌ను కలిశారు. స్థానిక ఎస్ఐ తమ ఫిర్యాదును తీసుకోవడంలేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మళ్లీ ఆదివారం వెళ్లి ఫిర్యాదు చేయబోయినా ఎస్ఐ తీసుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి పలు దఫాలుగా రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిందితుడిని కాపాడేందుకు అతడికి దగ్గరి వారైన ఓ మాజీ ప్రజాప్రతినిధి, పోలీసు అధికారుల ఒత్తిడితోనే స్థానిక ఎస్ఐ తమ ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆరోపించారు. నిందితుడి తరఫు వాళ్లు సృష్టించి తెచ్చిన నకిలీ జనన ధ్రువపత్రాలతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో మనోవేదన చెందిన బాలిక వెంటనే సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు ఎక్కి దూకబోయింది. వెంటనే బాలిక సోదరుడు, స్థానిక పోలీసు సిబ్బంది వెళ్లి ఆమెను అడ్డుకున్నారు. అనంతరం కేసు నమోదు చేస్తానని ఎస్సై హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తరువాత పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.