మధిర, ఫిబ్రవరి 18: పంటలు పండించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశతో కౌలుకు తీసుకున్న మాగాణి భూమిలో పంట సాగు చేసి చివరకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చింతకాని మండలం లచ్చగూడెం గ్రామవాసి నెరుసుల ఎల్లయ్య(45) పురుగుమందు తాగి సాగు చేసిన మాగాణిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రైవర్గా జీవనం సాగిస్తూ దీనికి తోడు పంటలు సాగు చేయాలన్న ఆశతో గ్రామంలోని మాదిని మునయ్య అనే రైతు వద్ద మూడు ఎకరాల రూ.80 వేలకు కౌలుకు తీసుకున్నాడు. కౌలుకు తీసుకున్న భూమిలో వరి పంట సాగు చేశాడు. ఈ పొలానికి నాగార్జునసాగర్ చింతకాని మేజర్ కాలువ నుంచి నీరు సరఫరా కావాల్సి ఉంది. సాగర జలాలు సక్రమంగా రాకపోవడంతో పాటు వారబందితో సాగునీటిని నిలిపి వేస్తున్నారు.
దీంతో సాగు చేసిన వరి పొలం పొట్ట దశలో ఉండి సాగునీరు అందక నెర్రలు కొట్టింది. ప్రక్కనే ఉన్న వాగులో కూడా నీరు లేకపోవడంతో కౌలు రైతు సాగు చేసిన వరి పైరు ఎండిపోయే దశకు వచ్చింది. సాగుచేసిన పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక మనస్థాపానికి గురయ్యాడు. కౌలుకు తీసుకున్న వరి మాగాణి సుమారు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాaన్న ఆవేదనతో కుంగి పోయాడు.
విధి లేని పరిస్థితుల్లో పురుగుమందు తెచ్చుకొని సాగు చేసిన వరి పొలంలోనే సేవించి అపస్మారక స్థితిలో వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలాన్ని వైద్య సేవల కోసం 108 వాహనం ద్వారా తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే కౌలు రైతు మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. మృతుడికి భార్యా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ నాగులమీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.