ఖమ్మం, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలకు ప్రజలు విలవిల్లాడుతూ ప్రాణాలు వదులుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రతకు, వడగాలులకు తట్టుకోలేక మంగళవారం పది మంది మృతిచెందారు. జూలూరుపాడు మండలం బచ్చల కోయగూడెంకు చెందిన జబ్బా రామనాథం అలియాస్ సుధాకర్ (55) వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఖమ్మం నగరం 4వ డివిజన్ పరిధి ఇండస్ట్రియల్ ఏరియాలో నివసిస్తున్న బోసిన విజయ (55) రోజువారీగా సుతారీ పనులకు వెళ్లింది.
పని ప్రదేశంలోనే వడదెబ్బకు గురై మృతిచెందింది. కారేపల్లి మండలం దుబ్బతండా, రేలకాలయపల్లికి చెందిన బానోతు రమేశ్ (39), పాయం వెంకటనర్సయ్య (52) గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో రమేశ్ డోర్నకల్ వెళ్లి వస్తుండగా వడదెబ్బకు గురై పుల్లూరు సమీపంలో మృతిచెందాడు. వెంకటనర్సయ్య వడదెబ్బతో అనారోగ్యానికి గురై మృతిచెందాడు. తల్లాడకు చెందిన మిర్చి కమిషన్ వ్యాపారి బండారు మోహన్‌రావు (65), వైరా మండలం రెబ్బవరానికి చెందిన గుత్తా శ్యామలమ్మ (85), అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన డాబా దుర్గయ్య (70) వడదెబ్బతో చికిత్స మృతిచెందారు. కొత్తగూడెం బర్లిఫిట్ ఏరియాలో తోట రాంబాబు (50), నేలకొండపల్లి మండలం పైనంపల్లికి చెందిన గండు నర్సమ్మ (75), కొత్తగూడెం గౌతంపూర్ పంచాయతీ టీ2, 3ఏ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మాజీ కార్మికుడు పిట్టల నరసింహారావు (60) వడదెబ్బతో మృతిచెందారు.