తెలుగు ప్రజల కొత్త వసంతం ‘విశ్వావసు’ కాలగమనంలోకి ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యిమి నూతన సంవత్సరం (ఉగాది) ఆదివారం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వాసులందరూ తెలుగు ప్రజల నూతన సంవత్సరాదిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సాయంత్రం వేళల్లో అన్ని ప్రముఖ ఆలయాల్లోనూ వేదపండితులు, అర్చకుస్వాములు పంచాంగ శ్రవణం చేశారు. విశ్వావసు అనేక సస్యాలతో సువృష్టిని కలిగిస్తుందని, తద్వారా సత్కర్మలు జరుగుతాయని ఉపదేశించారు.
సమస్త మానవాళికి, ప్రకృతికి క్షేమం ప్రాప్తిస్తుందని పేర్కొంటూ అనుగ్రహ భాషణం చేశారు. ఉగాది సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో, ఎర్రుపాలెం జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయం, కొత్తగూడెం విఘ్నేశ్వరాలయం, కూసుమంచి శివాలయం, ఖమ్మం గుంటుమల్లేశ్వరాలయం, నరసింహస్వామిదేవాలయాలు భక్తులతో కిటకిటలడాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 30