చర్ల, జూలై 11: చర్ల మండలంలోని తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ గ్రామం పూసుగుప్పలో సెంట్రల్ స్పెషల్ అసిస్టెన్స్ (సీఎస్ఏ) నిధులు రూ.కోటితో నిర్మించిన సంచార వైద్యశాల టెలీ ఆరోగ్య కేంద్రాన్ని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శుక్రవారం ప్రారంభించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి 18 కిలోమీటర్లు ఎస్పీ రోహిత్‌రాజుతో కలిసి బైకులపై ప్రయాణించి చేరుకున్నారు. సంచార వైద్యశాల ప్రారంభం అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయంలో వైద్యం అందేది కాదని, ఆ సమయంలో ఇక్కడి గిరిజనులు ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు.
భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ సంచార వైద్యశాలను ప్రారంభించామని అన్నారు. ఇక్కడ అన్ని రకాల మందులూ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వ పథకాలను ఇక్కడి ఆదివాసీలకు అందజేయడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, చర్ల సీఐ రాజువర్మ, బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు చెన్నూరి శ్రీనివాస్, ఈ.శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
పూసుగుప్ప నుంచి బైకులపై తిరుగు ప్రయాణమై వస్తున్న కలెక్టర్, ఎస్పీలను మార్గ మధ్యలో వెంకటచెర్వు, లెనిన్కాలనీలకు చెందిన ఆదివాసీలు ఆపారు. తమ సమస్యలపై వారికి వినతిపత్రాలు సమర్పించారు.