కొత్తగూడెం సింగరేణి, జూన్ 26 : రాష్ర్టానికే తలమానికమైన సింగరేణి బొగ్గు గనులను వేలం వేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు పూర్వవైభవం తేవడం కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బుధవారం కొత్తగూడెంలోని పీవీకే 5 షాప్ట్ గని వద్ద తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి చెందిన బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే.. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవడంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకునే విధంగా ఒత్తిడి పెంచాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి, వేతన కమిటీ సభ్యులు రియాజ్ అహ్మద్, కామెర గట్టయ్య, ఎల్.విశ్వనాథం, ఇఫ్టూ నాయకుడు గౌని నాగేశ్వరరావు, టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల రామనాథం, చార్వాక, మిట్టపల్లి కుమార్, నీరటి రాజన్న, రమేశ్, అనిల్‌రెడ్డి, ఆంజనేయులు, పార్వతి, రాజిరెడ్డి, మల్లికార్జున్‌రావు, అలీమొద్దీన్, బోనాల శ్రీనివాస్, రాజ్‌కుమార్, ఎం.అశోక్, యూసుఫ్, బాబా, మంచాల సమ్మయ్య పాల్గొన్నారు.