సబ్బండ వర్గాల అండతో ఉద్యమసారథి కేసీఆర్ సుదీర్ఘకాలం చేసిన పోరాటం వల్లనే నాలుగున్న కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని వక్తలు పేర్కొన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అనే నినాదంతో తెలంగాణ జనుల మద్దతుతో ఢిల్లీ పెద్దల మెడలు వంచిన కేసీఆర్.. స్వరాష్ట్ర కలను నిజం చేశారని గుర్తుచేశారు.
తద్వారా వలస పాలకుల నుంచి విముక్తి కల్పించి సమస్త తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛావాయువులను ప్రసాదించారని జ్ఞప్తికి తెచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సహా వివిధ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సోమవారం వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కేంద్రాల్లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయాలైన తెలంగాణ భవన్లలో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ, మధిరలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మం రూరల్‌లో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, మణుగూరు, కొత్తగూడెంలో బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఉద్యమనేత దిండిగాల రాజేందర్, దమ్మపేటలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలంలో ఉద్యమ నాయకుడు మానే రామకృష్ణ, నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ తదితరుల సారథ్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యమసారథి కేసీఆర్ సుదీర్ఘకాలంపాటు చేసిన పోరాటంతోనే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని గుర్తుచేశారు. స్వరాష్ట్ర స్వాప్నికుడి పాలనా దక్షతతోనే తెలంగాణ రాష్ట్రం ప్రగతిబాటల వైపు పయనించిందని జ్ఞప్తికి తెచ్చారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సింగరేణిలో సీఎండీ బలరాం, భద్రాచలం ఐటీడీఏలో పీవో రాహుల్, భద్రాద్రి కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్‌రాజు, ఖమ్మం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజ, ఖమ్మం జడ్పీలో సీఈవో దీక్షారైనా తదితరులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు, అమరవీరుల స్తూపాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆయా శాఖల అధికారులు తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. మువ్వన్నెల పతాకాలను ఎగురవేశారు.
-నమస్తే నెట్వర్క్