మామిళ్లగూడెం, అక్టోబర్ 8: నాణ్యమైన విద్యకు మోడల్‌గా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల్లో అభివృద్ధి పథకాలు, వరద సహాయక చర్యలపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నదని, ఇందుకోసం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి చర్యలు చేపడుతున్నదని అన్నారు. జిల్లా అధికారులు ప్రతి 15 రోజులకోసారి సంక్షేమ వసతి గృహాల్లో రాత్రి బస చేయాలన్నారు. త్వరలో హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, ఈ విషయంలో తేడా వస్తే వార్డెన్‌ను బాధ్యులను చేయడంతోపాటు సంబంధిత జిల్లా అధికారిపై చర్యలు ఉంటాయన్నారు.
రెండు నెలల క్రితం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ప్రతి నియోజకవర్గంలో భవన నిర్మాణాలకు భూసేకరణ చేయాల్సి ఉండగా.. 20 పాఠశాలలకు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయని, మిగతా చోట్ల త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
హైవేల నిర్మాణ క్రమంలో స్థానిక రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, రోడ్డు ప్రమాదాల్లో స్థానికులు ప్రాణాలు కోల్పోతున్నారని, హైవే నిర్మాణ సంస్థల నుంచి నిధులు తెప్పించి దెబ్బతిన్న రోడ్ల స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని, అధికారులు ఎంతో శ్రమించి పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించారన్నారు. సమీక్షలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.