ఖమ్మం, సెప్టెంబర్ 15: ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బాధ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇచ్చిన హామీలను అమలుచేయాలన్న డిమాండ్‌తో 33 జిల్లాల చైతన్యయాత్రలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బాధ్యులు చేపట్టిన యాత్ర ఆదివారం ఖమ్మానికి చేరుకుంది.
ఫోరం ఖమ్మం జిల్లా చైర్మన్ కేవీ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికీ 250 చదరపు గజాల స్థలం, రూ.25 వేల పింఛన్, ఉద్యమకారుల గుర్తింపు కార్డులు, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రూ.పది వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ హామీలను మేనిఫెస్టోలో కూడా పెట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా వాటిని అమలుచేయడం లేదని విమర్శించారు. ఈ హామీలను నెరవేర్చకుంటే మరో పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత ఖమ్మం మయూరిసెంటర్‌లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఫోరం బాధ్యులు అర్వపల్లి విద్యాసాగర్, నాంచారయ్య, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.