ఖమ్మం అర్బన్, జూన్ 1: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న నూతన అధ్యాపకుల రెండో వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆదివారం నిరసనలు కొనసాగాయి. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొన్న అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు, నల్లచొక్కాలతో రెండోరోజు తమ నిరసనను తెలిపారు.
టీజీజేఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సమస్యను తెలియజేయలేకపోతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి అధ్యాపకుల ఇంక్రిమెంట్లను చేయాలన్నారు. అనంతరం డీఐఈవో, క్యాంపు ఆఫీసర్ రవిబాబుకి అధ్యాపకులందరూ కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించకపోతే భవిష్యత్ కార్యచరణకు సిద్ధమని జిల్లా అధ్యక్షుడు గుమ్మడి మల్లయ్య స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు బాలస్వామి, షహీనాభేగం, అల్లు విజయ్, కిషోర్, జాన్, శ్రీకాంత్, వరలక్ష్మి, జ్యోత్స్న, నరసింహారావు, కట్టా రవీంద్రబాబు, గంటా కృష్ణ, పుల్లారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.