రఘునాథపాలెం/ కొత్తగూడెం అర్బన్/ మధిర, ఆగస్టు 15: ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించేందుకు అమరులు చేసిన త్యాగం అజరామరమైనదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రోద్యమంలో వీరులు చూపిన త్యాగాలను మనమందరమూ నిత్యం స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలైన తెలంగాణ భవన్లలో వారు శుక్రవారం త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. భారత సంగ్రామ బాటలోనే పయనిస్తూ అహింసామార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారని గుర్తుచేశారు.
స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణను సాధించారని జ్ఞప్తికి తెచ్చారు. ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు బానోతు చంద్రావతి, పగడాల నాగరాజు, బెల్లం వేణు, అజ్మీరా వీరూనాయక్, వాచేపల్లి లక్ష్మారెడ్డి, లకావత్ గిరిబాబు, పగడాల శ్రీవిద్య, బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం జిల్లా మధిర కార్యాలయంలో ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు మువ్వన్నెల పతాకాలను ఆవిష్కరించారు.