జూలూరుపాడు, జూలై 15 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొకిందని, తెలంగాణ ప్రయోజనాలను పకనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆంధ్రాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తకెళ్ళపల్లి రవీందర్రావు విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో భాగంగా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏల విసృ్తతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా తక్కెళ్ళపల్లి మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు.
మండల వ్యాప్తంగా వందశాతం ఓట్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కదలాలని పిలుపునిచ్చారు. పార్టీకి మూలస్తంభాలైన బీఎల్ఏలు రాబోయే వారంరోజులపాటు సైనికుల్లా శ్రమించాలన్నారు. ప్రతి బీఎల్ఏ స్వయంగా గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి, అర్హులైన వారందరితో ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయించి, వాటిని బూత్ లెవల్ అధికారులకు అందజేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల హామీలను గాలికొదిలేసిందని, నిధులు లేవని సాకులు చెబుతూ కాలయాపన చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు అలుముకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సలహాలు ఇస్తే స్వీకరించకపోగా పచ్చిబూతులు మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గపు పాలనపై ప్రజలు, రైతులు ఏకమై నిలదీయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, లకావత్ గిరిబాబు, ఎల్లంకి సత్యనారాయణ, కట్టా కృష్ణార్జున రావు, యదళ్లపల్లి వీరభద్రం, చాపలమడుగు రామ్మూర్తి, దుద్దుకూరి నాగేశ్వరరావు, తాళ్లూరు రామారావు, సేవా, జవహర్లాల్తోపాటు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.