కొత్తగూడెం అర్బన్, జూన్ 14 : చిన్నారులకు తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా మండల లెవల్ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. డీవార్మింగ్ మాత్రలు ఏడాది నుంచి మూడేళ్ల వయసు గల పిల్లలకు సగం మాత్రను పొడిచేసి నీళ్లలో కలిపి తాగించాలని, నాలుగేళ్ల నుంచి 19 ఏళ్ల వయసు గల వారు ఫుల్ టాబ్లెట్‌ను చప్పరించి మింగిన తర్వాత నీళ్లు తాగాలని సూచించారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, దీనిపై వైద్యులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, పాఠశాల ఉపాధ్యాయులు కూడా అవగాహన కల్పించారని అన్నారు. ఎన్డీడీ కార్యక్రమం ఈ నెల 20న నిర్వహించనున్నామని, దీనిని విజయవంతం చేయాలని ఆమె కోరారు. మాత్రలు మింగని పిల్లల చేత ఈ నెల 27న మళ్లీ కార్యక్రమంలో వేయిస్తామని తెలిపారు. అనంతరం డీవార్మింగ్ డే వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపర్వైజర్లు కరుణశ్రీ, సీహెచ్.శారద, వి.శ్రీనివాసరావు, దేవేంద్రమ్మ, శారద, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.