వేంసూరు, జనవరి 13 : ఈ నెల 18 నుంచి చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో తహసీల్దార్ ఎండీ.ముజాహిద్, వైద్యురాలు ఇందు ప్రియాంక, ఎంఈవో చలంచర్ల వెంకటేశ్వరరావు, ఎంపీవో రంజిత్‌కుమార్, ఏపీఎం శ్రీనివాస్, సీసీ ప్రసాద్, పీహెచ్సీ సిబ్బంది, కంటి వెలుగు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొత్తతండా సర్పంచ్ తేజావత్ మంగమ్మ అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యున్నత నాణ్యత కల్గిన వైద్యం పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. గ్రామాల్లో ఇంటింటి కంటి సర్వే చేపట్టామని, కంటి బాధితులంతా కంటి పరీక్ష శిబిరానికి వచ్చేలా స్థానిక ఉద్యోగులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి బానోత్ వెంకట్‌సింగ్, ఏఎన్ఎం పుష్ప, అచ్చమ్మ, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగుపై కరపత్రాల పంపిణీ
నేత్ర సమస్యలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ నెల 18 న ప్రారంభిస్తున్నదని అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ మండలంలోని పంచాయతీల్లో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, ఏఎన్ఎం, పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కంటి వెలుగుపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారని అన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల సిబ్బంది, ఉద్యోగులు, పంచాయతీల పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.