విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాస్(నేషనల్ అచీవ్మెంట్ సర్వే) ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఎఫెక్ట్ పడుతున్నది. కుటుంబ సర్వే కోసం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు విధులు కేటాయించింది. ఇందుకు మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొంటున్నారు. ఒంటిపూట బడులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. ఫలితంగా విద్యార్థుల సామర్థ్యాల పెంపు కోసం మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయులు ఇచ్చే శిక్షణకు
పూర్తి ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా 3వ తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.
– అశ్వారావుపేట, నవంబర్ 12
విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ విద్య శిక్షణ, రీసర్చ్ మండలి కలిసి నాస్(నేషనల్ అచీవ్మెంట్ సర్వే)ను నిర్వహిస్తున్నది. మొదటిసారి 2021లో నాస్ సర్వే నిర్వహించి ఆయా ఫలితాల ఆధారంగా విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి మండలి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొవిడ్ అనంతరం దేశవ్యాప్తంగా జరిపే అతిపెద్ద ప్రతిష్టాత్మక విద్యా సర్వే నాస్-2024. ఈ సర్వేను 3, 6, 9 తరగతులకు డిసెంబర్ 2024న నిర్వహించాలని నిర్ణయించారు.
విద్యార్థుల్లో భాష, గణితంలో కనీస విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నాస్’ అమలు చేస్తున్నది. ఈ సర్వే ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు తర్ఫీదునిస్తారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఉంటుంది. ఉపాధ్యాయులు ఉదయం సబ్జెక్టులు బోధించి.. మధ్యాహ్నం తర్వాత నాస్ మూల్యంకనంపై శిక్షణనిస్తారు. కానీ.. కుటుంబ సర్వేకు నాస్ తీవ్ర ఆటంకంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే కోసం ఎస్జీటీ ఉపాధ్యాయులకు విధులు కేటాయించడంతో నాస్ పరిధిలోని 3వ తరగతి విద్యార్థులు పూర్తిగా నష్టపోతున్నారు. 3, 6, 9 తరగతుల విద్యార్థులకు నాస్ ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల్లోనే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు బోధన అందిస్తారు. తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 7 తరగతుల విద్యార్థులు ఉంటారు. అంటే.. ప్రాథమిక పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులతోపాటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న 6వ తరగతి విద్యార్థులూ నాస్ శిక్షణకు దూరమవుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న 3, 6 తరగతుల విద్యార్థులపైనే అచీవ్మెంట్ ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
జాతీయస్థాయిలో జరిగే నాస్ సర్వే డిసెంబర్ రెండో వారంలో ఉండొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే నాస్-2024 సర్వే కోసం విద్యార్థులకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాదిరి పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాల ఆధారంగా ప్రత్యేక శిక్షణనిస్తారు. కానీ.. నవంబర్ నుంచి డిసెంబర్ రెండో వారం వరకు విద్యార్థులకు ఇవ్వాల్సిన శిక్షణకు ఉపాధ్యాయులను ఇంటింటి సర్వే దూరం చేసింది. గతంలో తీసుకున్న తర్ఫీదును విద్యార్థులు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సర్వే విద్యార్థుల నాస్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించనున్నదని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నాస్లో ఆశించిన ఫలితాలు రాకుంటే ఉపాధ్యాయులపైనా ప్రభావం పడుతుందని వారు కలత చెందుతున్నారు.