పాల్వంచ, మే 31 : జిల్లాలోని రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన చెందొద్దని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఆయన.. ఎన్ని విత్తనాలు? రైతులు ఏ మేరకు కొనుగోలు చేశారు? అని ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 2,16,625 ఎకరాల్లో పత్తి సాగవుతున్నట్లు అంచనా వేశామన్నారు. ఇప్పటివరకు 3,83,004 పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాకు వచ్చాయని, 5,41,560 ప్యాకెట్లు మరో వారం రోజుల్లో వస్తాయని వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి బాబురావు మాట్లాడుతూ 56-60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాతే రైతులు పత్తి విత్తనాలు నాటాలన్నారు. బీటీ-2 పత్తి విత్తన రకాలు చాలా ఉన్నాయని, గత సీజన్లో వచ్చిన దిగుబడిని బట్టి విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు. కాగా.. పాల్వంచలోని సాయిరాం ఆగ్రోస్, బాలాజీ ట్రేడర్స్ విత్తన దుకాణాల్లో రిజిస్టర్లను పరిశీలించారు. వారి వెంట ఏడీఏ టెక్నికల్ రవికుమార్, మండల వ్యవసాయాధికారి శంభోశంకర్ ఉన్నారు.