ఖమ్మం రూరల్, మే 26 : మధ్యవర్తిగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ జక్కి అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో సర్వే నెంబర్ 713/ఏ2లో 2,700 చదరపు గజాల స్థలం ఉంది. సదరు వ్యక్తి ఆ భూమిని తన కొడుకు పేరుపై గిఫ్టు రిజిస్ర్టేషన్ చేయించిందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రెండు రోజుల క్రితం వెళ్లాడు.
అప్పటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.51 వేలతో చలానా సైతం తీసుకున్నాడు. అయినప్పటికీ గిఫ్టు డీడ్ రిజిస్ట్రేషన్‌కు సబ్ రిజిస్ట్రార్ రూ.50 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు పన్నిన పథకం ప్రకారం.. మరోసారి బాధితుడు సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి రూ.50 వేలు ఇవ్వలేనని చెప్పి.. రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్ అరుణ ఆ డబ్బును డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్‌కు ఇవ్వాలని చెప్పింది.
ఆ తర్వాత భూమికి మధ్యాహ్నం ఒంటిగంటకు స్లాట్ బుక్ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత సదరు ఫిర్యాదుదారుడు మధ్యవర్తి వెంకటేశ్‌కు రూ.30 వేలు ఇస్తుండగా అప్పటికే కార్యాలయం వద్ద పాగా వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు డాక్యుమెంట్ రైటర్ లంచం తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్‌ను అరెస్టు చేసి వరంగల్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.