– ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు సోహెల్ అహ్మద్
కారేపల్లి, ఫిబ్రవరి 11 : విద్యార్థులు పరీక్షలంటే ఎటువంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ సోహెల్ అహ్మద్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ పాఠశాలలో బుధవారం ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు జిల్లా వైద్యశాఖ అధికారి (డిఎం అండ్ హెచ్ ఓ) డాక్టర్ బి.రామారావుతో కలిసి మార్చి నెలలో జరగబోయే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా హాజరయ్యే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య దశలో ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనూ, ఇతర వ్యక్తులతోనూ, సామాజిక పరిస్థితులతోనూ సరైన సర్దుబాటు ధోరణి అలవర్చుకోకపోవటం చేత పర్సనాలిటీ లోపాలు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఈగో, సూపర్ ఈగోల మధ్య సంఘర్షణ ఏర్పడటం వల్ల ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. ఇలాంటి వారినే సైకాలజీలో న్యూరోటిక్ పర్సనాలిటీస్ అంటారన్నారు.
వీరిలో అకారణ భయాలు, ఆందోళనలు, హైపోఖాండ్రియా వంటి లక్షణాలు కలుగుతుంటాయన్నారు. వీరికి పరీక్షలు సమీపిస్తున్నాయి అనగానే భయాందోళనలు కమ్ముకుంటాయని దీనినే యాంగ్జయిటీ న్యూరోసిస్ అంటారన్నారు. ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఛాతి నొప్పి, చెమటలు పట్టడం, నిస్సత్తువ, కడుపునొప్పి, తలనొప్పి, పల్స్‌రేటు పెరగటం, నోరు, పెదాలు ఎండిపోవటం, కండరాలు బిగపట్టేయటం, అరచేతులు, అరికాళ్లు చెమ్మబారటం వంటి సొమాటిక్ లక్షణాలు కన్పిస్తాయని వివరించారు. కాబట్టి భయం వీడితే జయం మనదేనని.. ఆత్మ విశ్వాసమే లక్ష్యసాధనకు ప్రధాన ఆయుధం అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితుల సూచనలు, ప్రణాళికాబద్ధ ప్రిపరేషన్ దోహద పడతాయన్నారు.
భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షా హాల్లోకి వెళ్లగలిగితే సగం విజయం సాధించినట్లేనన్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఒత్తిడికి గురికాకుండా పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం తీసుకోగానే క్షుణ్ణంగా చదివి వెంటనే ఓ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. బాగా వచ్చిన ప్రశ్నలు, కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు, రాని ప్రశ్నలను గుర్తించాలని, మొదట బాగా వచ్చిన ప్రశ్నలనే రాయాలన్నారు. తరువాత కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు ఆ తరువాత మిగతావాటి గురించి ఆలోచించాలని తెలిపారు. సమయాన్ని గమనిస్తూ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రావు, హెల్త్ సూపర్వైజర్ సరస్వతి పాల్గొన్నారు.

‘పరీక్షలంటే విద్యార్థులు భయపడొద్దు.. భయం వీడితే జయం మనదే’