పాల్వంచ రూరల్, జూలై 5 : పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకుడు బి.సాయి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడంతో యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని, లేదంటే విద్యార్థులను కూడగట్టి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు అఖిల్, రమేశ్, నరేశ్, నాగశ్రీ, జ్యోతి, మానస తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ, జూలై 5 : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తూ ముదిగొండ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి శనివారం నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షుడు కొమ్ము మహేశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు చెల్లిస్తేనే టీసీలు, మెమోలు ఇస్తామనడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనాథ్, భరత్, కల్యాణ్, సాయికృష్ణ, వరుణ్‌కుమార్, మనోజ్, పృథ్వీ, రమ్యశ్రీ, ప్రియాంక, రాజేశ్వరి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.