దమ్మపేట రూరల్/ దమ్మపేట, ఆగస్టు 2 : నాణ్యమైన ఆహారం లేదు… మెనూ అమలు అసలే లేదు.. కుళ్లిన అరటిపండ్లు ఇస్తున్నారు.. అన్నంతో తయారుచేసిన పులిహోర(అల్పాహారం) తినలేకపోతున్నాం.. ఉడికీఉడకని అన్నం బిరుసుగా ఉండి మింగుడు పడటం లేదని హాస్టల్ విద్యార్థులు గగ్గోలు పెట్టారు. దమ్మపేట మండలంలోని చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శనివారం విలేకరుల ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఉదయం 9గంటల వరకు అల్పాహారం అందించకపోవడంతో అదే సమయానికి హాస్టల్‌కు వచ్చిన విలేకరులకు తమ కష్టాలు చెప్పుకున్నారు. మెనూ ఏమాత్రం అమలు చేయడం లేదని, కూరగాయలు సక్రమంగా పాఠశాలకు రావడంలేదని, ఉదయం బూస్టు ఇవ్వడం లేదని చెప్పారు. ‘నెలరోజులుగా సరైన తిండి లేక ఆకలితో అలమటిస్తున్నామని, ఉడికీఉడకని అన్నం పెడుతున్నారని, కుళ్లిన అరటిపండ్లు ఇస్తున్నారని, తినలేక పడేస్తే తిడుతున్నారని, ఫ్యాన్ల రిపేర్ కోసం డబ్బులు అడుగుతున్నారని, తమను పట్టించుకునే వారే లేరని’ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారికి టీసీలు ఇచ్చి ఇంటికి పంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్(ఏటీడీవో) చంద్రమోహన్‌ను వివరణ కోరగా చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలోని సమస్యలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కడుపునిండా తిండి పెట్టలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
హాస్టల్ పిల్లలకు కడుపునిండా సరైన తిండి కూడా పెట్టడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండిపడ్డారు. చీపురుగూడెం హాస్టల్ విద్యార్థుల గోడు వీడియో సోషల్ మీడియాలో చూసిన మెచ్చా కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జల్సాల కోసం ఒక్కో ప్లేటు భోజనానికి లక్షన్నర ఖర్చు చేస్తున్నారని, విద్యారంగాన్ని నెంబర్‌వన్‌గా మార్చడం అంటే విద్యార్థుల కడుపులు మాడ్చడమేనా అంటూ ప్రశ్నించారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
– మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు