పుస్తకాల్లో నిక్షిప్తమైన సమాచారం.. ఉపాధ్యాయులు బోధించే పాఠాలతో మాత్రమే విద్యార్థుల్లో మనోవికాసం, మేధోవికాసం జరుగదు.. వారిలో సృజనాత్మకతను పెంచి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది, పరిశోధనలు, ప్రయోగాలకు అవకాశమిస్తే వారు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉన్నది. వారిని సరికొత్త ఆవిష్కరణల వైపు, పరిశోధనల వైపు మళ్లించేందుకు రాష్ట్రవిద్యాశాఖ ఏటా ఇన్స్పైర్, సైన్స్‌ఫెయిర్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా ఈ నెల చివరి వారంలో రెండు కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించేందుకు జిల్లావిద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఇన్‌స్పైర్‌కు 114 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. సైన్స్‌ఫెయిర్‌కు ప్రతి పాఠశాల నుంచి ఒక నమూనా అయినా ఉండాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. సాధారణంగా ఈ కార్యక్రమాలు నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించాల్సి ఉన్నది. కానీ ఎన్నికల కారణంగా కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యమయ్యాయి.
ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 10: పుస్తకాల్లోని జ్ఞానం.. తరగతి గదిలో నేర్చుకునే పాఠం.. ఒక్కటే విద్యార్థుల అభివృద్ధికి దోహద పడవు. మేధోవికాసాన్ని వెలికి తీసి జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దాలంటే వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సి ఉంటుంది. వారిని సరికొత్త ఆవిష్కరణల వైపు, పరిశోధనల వైపు మళ్లించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. అలా జరిగితేనే విద్యార్థులు రేపటి శాస్త్రవేత్తలుగా తయారవుతారు. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర విద్యాశాఖ పాఠశాల విద్యార్థుల కోసం ఏటా ఇన్స్పైర్, సైన్స్‌ఫెయిర్ వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా ఈ నెల చివరి వారంలో రెండు కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించేందుకు జిల్లావిద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఇన్‌స్పైర్‌కు 114 ప్రాజెక్ట్‌లు ఎంపికయ్యాయి. సైన్స్‌ఫెయిర్‌కు ప్రతి పాఠశాల నుంచి ఒక నమూనా అయినా ఉండాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. సాధారణంగా ఇన్స్పైర్, సైన్స్‌ఫెయిర్ నవంబర్ లేదా డిసెంబర్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల కారణంగా కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యమయ్యాయి.
2023-24 ఇన్స్పైర్ అవార్డ్స్ మేళాకు విద్యాశాఖ జిల్లావ్యాప్తంగా 114 ప్రాజెక్ట్‌లను ఎంపిక చేయింది. ఎంపికైన విద్యార్థులకు రూ.10 వేలు మంజూరు చేసింది. ఇప్పటికే సొమ్ము వారి ఖాతాల్లో జమ అయింది. ఈ సొమ్ముతో వారు నాణ్యమైన ప్రాజెక్ట్‌లు తయారు చేసేందుకు అవకాశం ఉన్నది. సొమ్ము జమ కాని విద్యార్థులు వెంటనే తమ అకౌంట్ వివరాలు, కవరింగ్ లెటర్‌ను డీఈవో కార్యాలయంలో అందజేయాలి. ప్రదర్శనలకు ఉపాధ్యాయులు, యాజమాన్యాలు గైడ్ చేయాలి. పరిశోధనల ప్రదర్శనను జిల్లాస్థాయి సైన్స్ అధికారులు తొలుత ఆన్లైన్ విధానంలో నిర్వహించాలనుకున్నారు. కానీ సైన్స్ఫెయిర్తో కలిపి నిర్వహించాలని తిరిగి నిర్ణయం తీసుకున్నారు.
పాఠశాలల్లో చదువుతున్న 10- 17 ఏళ్లలోపు బాలబాలికలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేసేలా తీర్చిదిద్దాలన్నది జిల్లాస్థాయి జవహర్ లాల్ నెహ్రూ గణిత, సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ లక్ష్యం.
10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసులోపు విద్యార్థులను జూనియర్స్‌గా, 15 సంవత్సరాల వయస్సు నుంచి 17 సంవత్సరాల వయస్సులోపు విద్యార్థులను సీనియర్స్‌గా నిర్వాహకులు పరిగణిస్తారు. ప్రదర్శనలో ప్రధాన అంశం ‘పర్యావరణ ప్రదర్శన, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సోసైటీ’. ఉప అంశాలుగా హెల్త్, లైఫ్, అగ్రికల్చర్, కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్, కాంపుటేషనల్ థింకింగ్ ఉంటాయి.
ఒకే పాఠశాల నుంచి ఎన్ని ప్రాజెక్ట్‌లు అయిన సైన్స్‌ఫెయిర్, ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించవచ్చు. ఐదుగురు బాలలు జట్టుగా ఏర్పడి గైడ్‌గా ఒక టీచర్‌ను ఎంచుకోవచ్చు. అందరూ కలిసి ఒక మంచి ప్రాజెక్ట్‌ను ప్రదర్శించవచ్చు. విద్యాశాఖ మిల్లెట్స్ ఫర్ హెల్త్ అండ్ సైస్టెనబుల్ ప్లానెట్ అంశంపైనా సెమినార్ నిర్వహించనున్నది.
జిల్లాలో ఏటా నిర్వహిస్తున్న సైన్స్‌ఫెయిర్‌కు ఆదరణ పెరిగింది. ఇన్‌స్పైర్‌కు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్ట్‌ల రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు.
ఇన్స్పైర్-2023కి ఎంపికైన వారితో సైన్స్‌ఫెయిర్‌కు మంచి ప్రాజెక్ట్‌లు చేయించాలని ప్రధానోపాధ్యాయులకు డీఈవో సూచించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు సహకరించి ప్రాజెక్ట్‌లు సిద్ధం చేయాలన్నాం.