దేశంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తప్పిదమే ఈ సంక్షోభానికి కారణమని ఏఐ చాట్ బాట్ గ్రోక్ అభిప్రాయపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి ముందే తెలిసినా కేంద్రం మేల్కొనలేదని, అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషించింది. మరోవైపు, ఎల్పీజీ సంక్షోభం మధ్యాహ్న భోజన పథకంపైనా తీవ్ర ప్రభావం చూపింది. గ్యాస్ కొరతతో అనేక పాఠశాలలు ప్రత్యామ్నాయ ఇంధనం కోసం అన్వేషిస్తున్నాయి. కట్టెల పొయ్యితో పిల్లలకు ఆహారాన్ని అందించేందుకు వంట సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తీవ్రస్థాయిలో గ్యాస్ సంక్షోభం నెలకొన్నది. వీధుల్లోకి వచ్చిన ప్రజలు వంటగ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల ముందు పడిగాపులు కాస్తున్నారు. తీవ్రమైన ఎండతో పలువురు క్యూలోనే మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్, పీజీలతో పాటు ఆలయాల్లోని అన్నదాన సత్రాలు కూడా మూతబడ్డాయి. గ్యాస్ సంక్షోభంపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ దుస్థితి వాటిల్లిందని మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ కూడా వ్యక్తం చేయడం గమనార్హం. దేశంలో గ్యాస్ సంక్షోభానికి కేంద్రం తప్పిదమే కారణమని గ్రోక్ స్థూలంగా విశ్లేషించింది.