కొత్తగూడెం గణేష్ టెంపుల్, నవంబర్ 7: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శుక్రవారం వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు.
పీడీఎస్యూ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ జీవో ప్రతులను దహనం చేయగా.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బకాయిలు విడుదల చేయకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.