ఖమ్మం, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చిన్నచిన్న పదాలు, సంఖ్యలు, పటాలపై చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించేందుకు చాలామంది విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్)లో సత్తా చాటలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు కనీస అభ్యసన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు.. ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఖమ్మంలోని డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్(డైట్) కళాశాలలో మంగళ, బుధవారాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో మండలాలవారీగా కొంతమందిని ఎంపిక చేశారు. వీరిలో ప్రాథమిక పాఠశాలల పరిధిలో మండలం నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. అందులోనూ ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో సబ్జెక్టు(తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం) టీచర్లను ఎంపిక చేశారు. ఉన్నత పాఠశాలల పరిధిలో రెండు మండలాలను ఒక గ్రూపుగా కలిపి 12 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో సబ్జెక్టు(తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఫిజిక్స్, జీవశాస్త్రం, సోషల్) టీచర్లు ఉన్నారు. ఈ నెల 30న మంగళవారం ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల నుంచి ఎంపిక చేసిన టీచర్లకు తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులపై రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, 31న బుధవారం గణితం, పరిసరాల విజ్ఞానం, ఫిజిక్స్, జీవశాస్త్రం, సోషల్ సబ్జెక్టుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
జిల్లా నుంచి ఎంపిక చేసిన 20 మంది రిసోర్స్ పర్సన్లు రాష్ట్రంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఎన్సీఈఆర్టీలో శిక్షణ పొందారు. వీరి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలల నుంచి 84 మంది, ఉన్నత పాఠశాలల నుంచి 120 మంది ఉపాధ్యాయులకు ఖమ్మంలో శిక్షణ ఇవ్వనున్నారు. న్యాస్ పరీక్ష ఓఎంఆర్ ఆధారంగా జరగనున్నందున ఓఎంఆర్ పత్రాలపై సమాధానాలు గుర్తించేందుకు వీలుగా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ ప్రక్రియలో సాధారణ సిలబస్ బోధనతోపాటు నేషనల్ అచీవ్మెంట్ సర్వే(న్యాస్) మాదిరి ప్రశ్నలను కూడా ఇస్తారు.
పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలు పెంచడమే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసింది. ‘తొలిమెట్టు’ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను చాలా వరకు మెరుగుపరిచాయి. ఈసారి నిర్వహించే ‘న్యాస్’ పరీక్షకు ‘తొలిమెట్టు’ కార్యక్రమం ఎంతగానో దోహదపడనుంది. చదవడం, రాయడం, పాఠంలోంచి కొత్త ఆలోచన రేకెత్తించడం వంటి సరికొత్త పద్ధతులను అనుసరించి విద్యార్థుల ప్రమాణాలు పెంచారు.
న్యాస్‌కు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ దఫా 2024 నవంబర్ 30న పరీక్షను నిర్వహించనున్నారు. 3, 6, 9 తరగతుల్లో ఎంపిక చేసిన ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్, గణితమంటే వణికిపోకుండా నూతన పద్ధతుల్లో వారిని సన్నద్ధం చేయనున్నారు. 6, 9 తరగతుల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కనీస పరిజ్ఞానం కొరవడడంతోపాటు భాషలో బలహీనంగా, వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి శిక్షణ ఇవ్వనున్నారు.
డైట్ కళాశాలలో నిర్వహించే న్యాస్ శిక్షణకు కోర్సు డైరెక్టర్‌గా డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ, కోఆర్డినేటర్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్‌గా కేశవపట్నం రవికుమార్ వ్యవహరించనున్నారు. డైట్లో శిక్షణకు అనుగుణంగా తరగతి గదులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేందుకు అవసరమైన కేయాన్స్, శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు భోజన వసతి కల్పించనున్నారు.