ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 3 : హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీగా వెళ్లి ఖమ్మం నగరంలోని మంత్రి పొంగులేటి ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
వారిని అరెస్టు చేసి అర్బన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, పీడీఎస్‌యూ కార్యదర్శి మస్తాన్, సురేశ్ మాట్లాడుతూ హైదరాబాద్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల వేలంపై నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, భూముల విషయమై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు.
విద్యార్థి సంఘం నాయకుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. హెచ్‌సీయూ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ముట్టడి కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు లోకేశ్, సుధాకర్, శివ, నాగుల్‌మీరా, రాజు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.