ఎర్రుపాలెం, జూలై 03 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని చొప్పకట్లపాలెం, రాజులదేవరపాడు పూర్వ ప్రాథమిక పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రవేశాలను పెంచి వారికి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణలను పరిశీలించిన ఆయన మధ్యాహ్న భోజన పథకం అమలును తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అనంతరం బనిగండ్లపాడులోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడ నిర్వహణ సాధ్యం కాదని గుర్తించారు. ఈ నేపథ్యంలో బీసీ హాస్టల్‌ను శ్రీ రామ్మోహన్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ యన్నం పిచ్చిరెడ్డి చేసిన విజ్ఞప్తిపై డీఈఓ వెంటనే స్పందించి అనుమతి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మురళీమోహన్, ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి, జంగా గురునాథరెడ్డి, మారపాక బాబురావు, నండ్రు వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.