ఖమ్మం రూరల్, మే 15 : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం మండలంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కలెక్టర్ విధుల్లో ఉన్న సాయుధ బలగాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాటు చేసిన లైట్లు 24 గంటలపాటు నిరంతరాయంగా వెలగాలన్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద సీసీ కెమెరాల వ్యూ కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలను పరిశీలించి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంట్రీ పాస్ ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే స్ట్రాంగ్‌రూంల పరిశీలనకు అనుమతించాలన్నారు. అలాగే కౌంటింగ్ రూంల వద్ద ఏర్పాట్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ పీ.మౌనిక, అదనపు కలెక్టర్ డీ.మధుసూదనాయక్, అదనపు డీసీపీ ప్రసాదరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్యాంప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.