ఖమ్మం రూరల్, ఆగస్టు 16 : ఎగువన కురిసిన భారీ వర్షాలకు మున్నేరు వాగులో వరద ప్రభావం పెరిగినందున పరిసర ప్రాంతాల్లో పటిష్ట గస్తీ ఏర్పాటు చేసినట్లు ఖమ్మం రూరల్ సీఐ ముష్కరాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని మున్నేరు పరిసర ప్రాంతాలను సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు మున్నేరు సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి, ప్రజలెవరూ అటువైపు రాకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వరద తీవ్రత మరింత పెరిగితే ఆయా ప్రదేశాల్లో భారీకేడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా మున్నేరు సమీప ప్రాంతాల్లో సెల్ఫీలు, వీడియోలు పూర్తిస్థాయిలో నిషేధమని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది వరద ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సమీప కాలనీల వాసులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వరద ప్రభావానికి అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందజేయడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే డయల్ 100 కు కాల్ కాల్ చేసి అవసరమైన సహాయం పొందవచ్చు అని తెలిపారు.