ఖమ్మం సిటీ, ఆగస్టు 6: ఖమ్మం పెద్దాసుపత్రిలో కార్మికులు మరోసారి సమ్మెకు దిగారు. కార్మికులకు ప్రతినెలా వేతనాలు ఇవ్వకపోవడం, దీంతో వారు నెలల తరబడి విసిగి వేసారి సమ్మెకు దిగడం, ఆ తరువాత అధికారులు చర్చించి వేతనాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం, ఒకవేళ ఒకటీ రెండు నెలలవి ఇచ్చినా ఆ తరువాతి నెలల్లో మళ్లీ పాత పరిస్థితి పునరావృతం కావడం వంటివి ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గడిచిన ఏడాదిన్నరగా నిత్యకృత్యంగా మారాయి.
తాజాగా బుధవారం కూడా ఇంకోసారి కార్మికులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు కలిపి దాదాపు 259 మంది మరోసారి సమ్మె సైరన్ మోగించారు. నెల రోజుల్లో పూర్తిస్థాయి వేతనాలు చెల్లిస్తామని ఇటీవలే జిల్లా ఉన్నతాధికారులు చెప్పిన మాటలు నీటిమీద రాతలయ్యాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్మికులు మళ్లీ బుధవారం విధులు బహిష్కరించారు.
టీయూసీఐ, సీఐటీయూ ఆధ్వర్యంలో దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతోపాటు వచ్చేవాటిని కూడా నెలవారీగా ఇవ్వకపోవడంతో తాము తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం ఇళ్ల అద్దెలు కూడా చెల్లించుకోలేక, కన్న బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టుకోలేక దుర్భర జీవితాలను గడుపుతున్నామని ఆవేదన చెందారు. అయినా, ప్రభుత్వం కనికరించడం లేదని దుయ్యబట్టారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ తమ ఆకలి కేకలు వినిపించకపోవడం దేనికి నిదర్శనమో వారే చెప్పాలని ప్రశ్నించారు. బకాయిలను కలుపుకుని పూర్తిస్థాయి వేతనాలు చెల్లించే వరకు విధులు నిర్వహించేది లేదని, ఈ దఫా తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
నాణ్యమైన వైద్యం అందించాలి
ప్రభుత్వ పశు వైద్యశాల తనిఖీలో కలెక్టర్
రఘునాథపాలెం, ఆగస్టు 6 : పశు వైద్యశాలల్లో మూగజీవాలకు నాణ్యమైన వైద్యం అందించాలని, వైద్యానికి అవసరమయ్యే మందుల కొరత రాకుండా చూసుకోవాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్లోని ప్రభుత్వ జిల్లా పశు వైద్యశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశు వైద్యశాలలో ఉన్న మందులు, స్కానింగ్ గది, శస్త్ర చికిత్సల థియేటర్, ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
వర్షాకాలం మూగ జీవాలు వ్యాధుల బారినపడే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ సరైన వైద్యం అందించాలని సూచించారు. పశు వైద్యులు మెరుగైన వైద్య సేవలతోపాటు కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి పశు అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ వీ శ్రీనివాసరావు, సీనియర్ వైద్యులు డాక్టర్ కిశోర్, సిబ్బంది ఉన్నారు.